ఆంధ్ర, తెలంగాణాలలో తెదేపాకు సైకిల్ గుర్తు కేటాయింపు

 

తెలుగుదేశం పార్టీని ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తూ ఎన్నికల కమీషన్ ఆ పార్టీకి రెండు రాష్ట్రాలలో కూడా సైకిల్ గుర్తునే కేటాయించచింది. అందువల్ల ఇకపై రెండు రాష్ట్రాలలో జరిగే ఏ ఎన్నికలలోనయినా తెదేపా ప్రాంతీయ పార్టీ హోదాలో సైకిల్ గుర్తుతో పోటీ చేయవచ్చును. తెదేపా అధ్యక్షుడు తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత యల్.రమణను నియమించారు. కనుక ఇకపై చంద్రబాబు నాయుడు కేవలం ఆంధ్రప్రదేశ్ పార్టీ విభాగానికి మాత్రమే అధ్యక్షుడుగా వ్యవహరించవలసి ఉంటుంది, కానీ ఆయన రెండు రాష్ట్రాలలో పార్టీకి అధ్యక్షుడుగా కొనసాగుతారు. ఈ సాంకేతిక సమస్యను అధిగమించాలంటే పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు పొందవలసి ఉంటుంది. అప్పుడు రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా అధ్యక్షులను నియమించి తాను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగావచ్చును. ఇటీవల గండిపేట వద్ద జరిగిన మహానాడు సమావేశాలలో పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించినప్పటికీ, ఆ గుర్తింపు పొందాలంటే పార్టీ కనీసం మూడు ఇతర రాష్ట్రాలలో పోటీ చేసి కనీసం 10 శాతం ఓట్లు సంపాదించవలసి ఉంటుంది. తెలుగువారు స్థిరపడిన కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ ద్వీపాలలో వచ్చే ఎన్నికలలో తెదేపా పోటీచేయాలని భావిస్తోంది. అందువల్ల జాతీయపార్టీ హోదా పొందేందుకు మరో ఐదేళ్ళు ఆగక తప్పదు. అంతవరకు ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో తెదేపా ప్రాంతీయ పార్టీగా కొనసాగవలసి ఉంటుంది.