మెరుగుపడిన తారకరత్న ఆరోగ్యం.. వెంటిలేటర్ పైనే చికిత్స
posted on Feb 1, 2023 2:37PM
బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఈ రోజు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బుధవారం (ఫిబ్రవరి 1) హెల్త్ బులిటిన్ విడుదల చేసిన వైద్యలు.. ఆయనకు మరి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, ఆ తరువాత మరో హెల్త్ బులిటిన్ విడుదల చేస్తామని తెలిపారు. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారనీ, ప్రస్తుతం ఆయనకు బ్రెయిన్ డ్యామేజీ రికవరీ చికిత్స అందిస్తున్నామనీ తెలిపారు. ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించిన వైద్యులు త్వరలోనే వెంటిలేటర్ సపోర్టు తొలగిస్తామని వివరించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ మంగళవారం( జనవరి 31)తో పోలిస్తే బుధవారం(ఫిబ్రవరి 1) ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిందని అన్నారు. గుండె, కాలేయం పనితీరు సాధారణంగానే ఉందని తెలిపారు. తారకరత్న చికిత్స పొందుతున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. నిన్నటి వరకూ గడ్డంతో కనిపించిన తారకరత్న తాజా ఫొటోలో క్లీన్ షేవ్ తో కనిపించారు.