హీరో సిద్ధార్థ్ కు బెదిరింపులు! బీజేపీ టార్గెట్ చేసిందా? 

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినా.. రాజకీయ కాక మాత్రం ఆగడం లేదు. తనను బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ప్రముఖ నటుడు సిద్దార్థ్‌ ఆరోపించడం కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలు తన ఫోన్‌ నంబర్‌ని సోషల్ మీడియాలో లీక్ చేశారని సిద్ధార్థ్ ట్వీట్ చేశారు.  తనని, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ పలువురు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన ట్వీట్ ను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశారు సిద్ధార్థ్. 

‘తమిళనాడు భాజపాకు చెందిన కొంతమంది నా ఫోన్‌ నంబర్‌ని లీక్‌ చేశారు.  సుమారు 500 ఫోన్‌కాల్స్‌.. అందరూ నన్ను తిడుతున్నారు. నా కుటుంబసభ్యులను అత్యాచారం, హత్య చేస్తామంటూ గడిచిన 24 గంటల నుంచి నన్ను హెచ్చరిస్తున్నారు. ఆ ఫోన్‌ నంబర్లు, వాళ్లు మాట్లాడిన రికార్డింగ్స్ అన్నింటినీ భద్రపరిచా. వాటిని పోలీసులకు అందిస్తున్నా’ అని సిద్దార్థ్‌ ట్వీట్ లో తెలిపారు. 

టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో ఎన్నో చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న సిద్దార్థ్‌ గత కొన్నిరోజులుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు బీజేపీ కార్యకర్తలతో ఆయనకు ఆన్‌లైన్‌లో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా తనను ఫోన్ లో కొందరు బెదిరిస్తున్నారని,చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని సిద్ధార్థ్ ఆరోపించడంతో వివాదం మరింత ముదిరింది.

మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మే2న జరగనుంది. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లోనూ డీఎంకే కూటమిదే విజయమని తేలింది. బంపర్ మెజార్టీతో స్టాలిన్ గెలవబోతున్నారని వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ టార్గెట్ గా సిద్ధార్థ్ తన వాయిస్ పెంచారనే చర్చ జరుగుతోంది. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై కొత్త సర్కార్ వచ్చాకా ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu