తెలంగాణ కళాకారుల వివరాలు మొబైల్ యాప్ లో
posted on Jul 24, 2020 5:18PM
కళల ఖజానాగా వర్ధిల్లుతున్న తెలంగాణలో ఉన్న ఎంతోమంది జానపద, గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారుల వివరాలు ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది రాష్ట్ర సాంస్కృతిక శాఖ. ఇందుకు సంబంధించి ప్రత్యేక యాప్ T-CULTURE ను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) సహకారంతో రూపొందించారు. ఇందులో కళాకారులందరికీ సంభందించిన డేటా అందుబాటులో ఉంటుంది.
మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక మొబైల్ యాప్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. వినూత్న మొబైల్ యాప్ ను రూపొందించినందుకు శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ లను మంత్రి అభినందించారు.
మారుమూల ప్రాంతాలలో ఉన్న కళాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్ లైన్ ద్వారా గుర్తింపు కార్డులను జారీ చేయడం సులభం అవుతుంది. కళాకారుల డేటా బేస్ ను రూపొందించి వారి జన్మస్థలం, కళారూపం, వయస్సు, చదువు, సాధించిన విజయాలు వంటి విషయాలు అందుబాటులో ఉంచుతారు. ఈ యాప్ ద్వారా ID కార్డ్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని MEE SEVA తో అనుసంధానం చేశామన్నారు. ID కార్డు కావాలనుకునే కళాకారులెవరైనా తమ వివరాలు, కళా ప్రదర్శన వివరాలు, వారి గురించి పత్రికలలో వచ్చిన కథనాలను మీ సేవ సెంటర్ లలో సమర్పించి 30 రోజులలో తమ ID కార్డ్ ను పొందవచ్చు. ఈ యాప్ 1 ఆగస్టు, 2020 నుండి అందుబాటులో ఉంటుంది. మొదటి కార్డు ను కవి, కళాకారుడు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందించారు.