కోమటిరెడ్డిపై సస్పెన్షన్ వేటు?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న  మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి  పై కాంగ్రెస్ పార్టీ వేటు వేస్తుందా? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా? అంటే.. అవును,కాదు అంటూ రెండు వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా    ఆదివారం (ఆగష్టు 10)  క్రమశిక్షణ కమిటీ చైర్మన్  మల్లు రవి అధ్యక్షతన సమావేశమవుతున్న పీసీసి క్రమశిక్షణ కమిటీ ఇతర అంశాలతో పాటుగా.. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించిన అంశాన్ని చర్చించనున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశం ప్రాధాన్యత  సంతరించుకుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

కాగా.. మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి  గత కొద్ది రోజులుగా బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా  విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవంక..  ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుమారం సృష్టిస్తున్నాయి.  

ఈ నేపథ్యంలోనే  కోమటి రెడ్డి వ్యాఖ్యలు, విమర్శలను సీరియస్  గా తీసుకున్న క్రమశిక్షణ కమిటీ  చైర్మన్ మల్లు రవి  ఆదివారం (ఆగస్టు 10) ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఎమ్మెల్యే  కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డికి సమన్లు పంపినట్లు తెలుస్తోంది. నిజానికి  కమిటీ చైర్మన్ మల్లు రవి రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డితో  ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శల వల్ల  ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోందని స్పష్టం  చేసినట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా తనకు మంత్రి పదవి ఇస్తామని ఒకటికి రెండు సార్లు ప్రామిస్  చేసి, ఇప్పడు  కులం, కుటంబం, జిల్లా లెక్కలు చూపించి తనకు మొండి చేయి చుపించడం పట్ల కోమటి రెడ్డి  రాజగోపాల్ రెడ్డి  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.   బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేర్చుకునే సమయంలో..  ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల సమయంలో, భువనగిరి బాధ్యతలు అప్పగించిన సమయంలో మరోమారు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చే సమయంలో  అడ్డు రాని  కులం, కుటుంబం, జిల్లా లెక్కలు ఇప్పడు ఎలా ఆడ్డు వస్తున్నాయని కోమటి రెడ్డి ప్రశ్నిస్తున్నారు.  కాదు కాదు గట్టిగా నిలదీస్తున్నారు. 

అంతే కాకుండా..  తమ అసంతృప్తిని వ్యక్తం చేసే క్రమంలో కోమటి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ చేసిన వ్యాఖ్యల మొదలు, సోషల్ మీడియా వ్యవహార శైలికి సంబంధించి చేసిన హెచ్చరికల వరకు అనేక విషయాల్లో బహిరంగంగా ముఖ్యమంరి  చేసిన విమర్శలను  పార్టీ  ముఖ్య  నాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. విమర్శించడమే కాకుండా.. ఒక విధంగా తిరుగుబాటు ధోరణి అవలంబిస్తున్న తీరు పట్ల పార్టీ  ముఖ్య  నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 10) భేటిలో ఏమి జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇప్పటి కిప్పుడు కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేదనీ, రేపటి సమావేశంలో సర్ది చెప్పే ప్రయత్నమే జరుగుతుందని అంటున్నారు.అందుకే..  క్రమశిక్షణ కమిటీ చైర్మన్  మల్లు రవి స్వయంగా  రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటామని..  ఆ తర్వాతనే  ఏం చేయాలనే దానిపై నిర్ణయం ఉటుందని చెప్పినట్లు  తెలుస్తోంది. మరో వంక రాజగోపాల రెడ్డికి కూడా తెగే వరకు లాగే ఆలోచన లేదని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu