వెంకటరెడ్డిపై వేటు పడింది!
posted on Aug 2, 2024 11:59AM
ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్, ఏపీఎండీసీ మాజీ ఎండి వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి నిబంధనలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆయన పలు అవకతవకలకు, అక్రమాలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే మైన్స్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో వెంకటరెడ్డి అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు రుజువవ్వడంతో వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాల్సిందిగా సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మేరకు ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఏపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన ఇసుక టెండర్లు, అగ్రిమెంట్లల్లో నిబంధనలు ఉల్లంఘించారని, సుప్రీం కోర్టు, ఎన్జీటీ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారని, అలాగే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని విచారణలో తేలింది.
దీంతో సెంట్రల్ సర్వీసెస్ రూల్స్ కింద ఆయనను సస్పెండ్ చేస్తే సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్ల కూడదంటూ వెంకటరెడ్డిని ఆదేశించారు. కోస్ట్ గార్డ్ లో సీనియర్ సివిలియన్ ఆఫీసర్ గా పని చేస్తున్న వెంకటరెడ్డిని జగన్ ఏరి కోరి ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటేషన్ పై తెచ్చుకున్నారు.