తెలంగాణ స్పీకర్ పై సుప్రీం సీరియస్
posted on Nov 17, 2025 12:12PM

ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారల్లోగా నిర్ణయం తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు గడువు నిర్దేశించింది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు గతంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను గతంలోనే ఆదేశించింది.
అయితే ఆ సమయం పూర్తయినా స్పీకర్ నిర్ణయం తీసుకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంటూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సోమవారం విచారించిన సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఎమ్మెల్యేల అనర్హతపై రోజు వారీ విచారణ జరిపి.. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నిర్ణయం ప్రకటించాలని సూచించినా.. ఆలస్యం చేయటం పైన సుప్రీం కోర్టు సీరియస్ అయింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ.. అప్పటి లోగా అనర్హతపై నిర్ణయం తీసుకుంటారా? లేక మేం తీసుకోవాలా? అంటూ ప్రశ్నించింది.దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది నాలుగువారాలలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేస్తామని చెప్పారు.