జగన్ సర్కార్ కు సుప్రీంలో చుక్కెదురు
posted on Oct 3, 2023 1:57PM
జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అంగళ్లు కేసులో తెలుగుదేశం నేతలకు బెయిలు మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
అయితే హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంగళ్లు ఘటనలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కూడా ఏపీ సర్కార్ కేసు నమోదు చేసిన విషయం విదితమే. కాగా ఏపీ హైకోర్టు ఈ కేసులో తెలుగుదేశం నేతలకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఏపీ సర్కార్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఆరు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. తెలుగుదేశం సీనియర్ నాయకులు చల్లాబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలను మంజూరు చేసిన బెయిలు రద్దు చేయాలని ఆ పిటిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే అందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
జగన్ సర్కార్ పిటిషన్లపై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం సంఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై అభ్యంతరం తెలిపింది. అంతే కాకుండా భద్రత కల్పించాల్సిన పోలీసులే సాక్షులుగా ఎలా ఉంటారని ప్రశ్నించింది. హైకోర్టు బెయిలు మంజూరు చేసినందున ఆ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరుపిటిషన్లను కొట్టివేసింది. ఇదే ధర్మాసనం చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను విచారించనున్న సంగతి విదితమే.