బాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా
posted on Oct 3, 2023 2:49PM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి క్వాష్ పిటిషన్ విచారణ సుప్రీం కోర్టులో కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించిన సంగతి విదితమే. సుప్రీం కోర్టులో మంగళవారం (అక్టోబర్ 3) విచారణకు వచ్చిన చంద్రబాబు పిటిషన్ ను జస్జిట్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.
ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోగా సమర్పించాలని సుప్రీం కోర్టు సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీని ఆదేశించింది. డాక్యుమెంట్లు అన్నీ హైకోర్టు ముందు ఉంచారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉన్నందును విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కాగా సీఐడీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ చంద్రబాబు బెయిల్ కోసం వెళ్ల కుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని, చంద్రబాబుకు 17ఏ వర్తించదని పేర్కొన్నారు. 17 సవరణ 2018లో జరిగిందనీ, కానీ స్కిల్ స్కాం అంతకు ముందే జరిగిందనీ ముకుల్ రోహత్గీ వాదించారు.
అయితే ఈ దశలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఆ దశలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని ముకుల్ రోహత్గీ పేర్కొంటే జస్టిస్ బేలా త్రివేది వెంటనే అవీనీతి సంగతి తరువాత ముందు 17ఏ గురించి మాత్రమే చెప్పండని నిలువరించారు. అంతే కాకుండా సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? అన్ని కేసులకూ వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ఆ దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుని 17ఏ అన్ని కేసులకూ వర్తిస్తుందని చెప్పారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే ఈ సొందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ ఒక్క ఆధారం చూడా చూపలేకపోయిందని మరో న్యాయవాది మను సింఘ్వీ పేర్కొన్నారు.
కేసు విచారణలో భాగంగా జస్టిస్ అనిరుధ్ బోస్ అసలు స్కిల్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదందనీ అడిగారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే 2021 డిసెంబర్ 9న ఎఫ్ ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేస్తున్నారని న్యాయమూర్తులకు తెలిపారు. అలాగే సిద్ధార్థ లూధ్రా ఈ కేసులో చంద్రబాబునాయుడిని సుదీర్ఘ కాలం జైల్లో ఉంచాలన్న ఏకైక లక్ష్యమే ఉందని స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ అప్పటి లోగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాదిని సుప్రీం కోర్టు ఆదేశించింది.