వీహెచ్‌ ఇంటిపై రాళ్ల దాడి.. రేవంత్‌రెడ్డి వార్నింగ్.. వారి ప‌నేనా?

కాంగ్రెస్‌లో సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్ వి.హెచ్‌. త‌న మాట‌లు, విమ‌ర్శ‌ల‌తో నిత్యం న్యూస్‌లో ఉంటూనే ఉంటారు. అలాంటిది, ఆయ‌నే న్యూస్‌గా మారారు. వి. హ‌నుమంతురావు ఇంటిపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాళ్ల దాడికి తెగించారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును దుండ‌గులు ధ్వంసం చేశారు. రాళ్ల దాడిపై హ‌న్మంత‌న్న గ‌రం గ‌రం అయ్యారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలో ఉద్రిక్త‌త నెల‌కొంది. 

మాజీ పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ ఎంపీగా పని చేసిన తననే రక్షణ క‌రువైంద‌ని మండిప‌డ్డారు వి.హెచ్‌. త‌న‌కు సెక్యూరిటీ క‌ల్పించాల్సిన బాధ్య‌త‌ ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. గతంలో బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేసినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పోలీసులు వీ.హెచ్ ఇంటికి వ‌చ్చి.. కారును ప‌రిశీలించారు. సీసీకెమెరా ఫూటేజీ ప‌రిశీలించారు. కేసు నమోదు చేశామ‌ని.. నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు. 

త‌మ పార్టీ నాయకులపై దాడులు జరిగితే ఊరుకోమంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి హెచ్చ‌రించారు. వీహెచ్‌తో రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో రోజురోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాలన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.   

కొంత‌కాలంగా వీహెచ్‌పై రేవంత్‌రెడ్డి సైన్యం సోష‌ల్ మీడియాలో తెగ దాడులు చేస్తోంది. ర‌క‌ర‌కాల ఫోటోల‌తో, ఫేక్ న్యూస్‌తో ఫుల్ ట్రోలింగ్ జ‌రుగుతోంది. వీహెచ్ టీఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్టు, ఆయ‌న మెడ‌లో గులాబీ కండువా ఉన్న‌ట్టు ఫోటోలు క్రియేట్ చేసి వైర‌ల్ చేయ‌డంపై అప్ప‌ట్లోనే వీహెచ్ సీరియ‌స్ అయ్యారు. పోలీసుల‌కు కూడా కంప్లైంట్ చేశారు. ఓ ద‌శ‌లో ఢిల్లీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డి అనుచ‌రులే త‌న‌ను బ‌ద్నాం చేస్తున్నారని బ‌హిరంగంగానే ఆరోపించారు వి.హ‌నుమంత‌రావు. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు ఏకంగా వీహెచ్ ఇంటిపైనే రాళ్ల దాడి జ‌ర‌గ‌డం.. ఆయ‌న కారును ధ్వంసం చేయ‌డంపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇది కూడా రేవంత్‌రెడ్డి అనుచ‌రులే చేసుంటార‌నే అనుమానం కూడా ఉంది. లేదంటే, రేవంత్ టీమ్‌పై డౌట్ వ‌చ్చేలా.. వారిద్ద‌రి మ‌ధ్య మ‌రింత గొడ‌వ‌ సృష్టించేలా.. టీఆర్ఎస్ శ్రేణులే ఈ దాడి చేసుంటార‌ని కూడా అంటున్నారు. ఎందుకైనా మంచిద‌ని.. ఆ అనుమానం త‌న‌మీద‌కు రాకుండా ఉండేందుకే అనేందుకు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం వెంట‌నే స్పందించారు. దుండ‌గుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. నిందితులు ఎవ‌రో తెలిస్తేనే గానీ.. వీహెచ్‌ని కెలికింది ఎవ‌రో బ‌య‌ట‌కు వ‌స్తుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu