విగ్రహాలఫై మంత్రి మాణిక్యవరప్రసాద్ కొత్త ట్విస్టు

హైదరాబాద్: విగ్రహాల ప్రతిష్టాపనకు మంత్రి మాణిక్యవరప్రసాద్ కొత్త ట్విస్టు ఇచ్చారు.అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసంపై దళిత మంత్రులు, శాసనసభ్యులు  సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విగ్రహాల ప్రతిష్టాపనకు పద్ధతి, క్రమం ఉండాలని ఆయన అన్నారు. మరణించిన 25 ఏళ్ల తర్వాత ప్రజలు కోరితే విగ్రహాలు స్థాపించే విధంగా నిబంధనలు మార్చాలని ఆయన అన్నారు. ఓ నాయకుడు చనిపోయిన తర్వాత ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ వర్తిస్తాయని అనుకుంటే ప్రజలు వాటిని పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు. ఎడాపెడా విగ్రహాలు పెడుతున్నారని, రౌడీలూ గూండాలకు కూడా విగ్రహాలు స్థాపిస్తున్నారని ఆయన అన్నారు. ఫాక్షన్ నేతలకు కూడా విగ్రహాలు పెడుతున్నారని ఆయన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల స్థాపనపై వ్యాఖ్యానించినట్లు తొలుత భావించారు. కానీ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల గురించి తాను మాట్లాడడం లేదని, వైయస్ రాజశేఖర రెడ్డి మహానుభావుడు అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ప్రజల ఆదరణ ఉందా లేదా అనేది చూడకుండా విగ్రహాలు పెడుతున్నారనేది మంత్రి అభిమతంగా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో రౌడీలు, గుండాలు, ఫాక్షనిస్టులకు కూడా విగ్రహాలు పెట్టడం చూస్తున్నామని ఆయన అన్నారు. పద్ధతి ప్రకారం విగ్రహాల స్థాపన లేకపోవడం వల్ల, ఎవరి విగ్రహాలు పడితే వారి విగ్రహాలు పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu