రాష్ట్ర ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారనున్న రాజధాని అంశం

 

ఇదివరకు తెలంగాణా ఉద్యమాలు పతాకస్థాయికి చేరుకొన్నప్పుడు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణా కమిటీ కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఇచ్చిన నివేదిక చివరికి చెత్తబుట్ట పాలయింది. పోనీ సొమ్ము పోయిన సమస్యలు పరిష్కారం అయ్యాయా అంటే అదీ లేదు. రాష్ట్రవిభజనకు ముందు, తరువాత కూడా అవే సమస్యలు తప్పడం లేదు. రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేసిన యూపీయే ప్రభుత్వం, రాజధాని కోసం కూడా మరో కమిటీ వేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా సమస్యను పరిష్కరించకపోగా రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టేదిగా ఉంది. అది మంచి సలహాలే ఇచ్చి ఉండవచ్చుగాక కానీ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ-గుంటూరు మద్యనే రాజధాని నిర్మించాలని భావిస్తునందున, కోట్లు ఖర్చుపెట్టి తయారు చేసిన ఈ కమిటీ నివేదికను కూడా చెత్తబుట్టలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న ఈ విషయంపై సుదీర్గంగా చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం, తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, విజయవాడ-గుంటూరు మద్య భూసేకరణకు ఆ జిల్లాల మంత్రులు, శాసనసభ్యులతో కూడిన ఒక కమిటీని వేయడంతో ఇది నిర్ధారణ అయింది. అంటే మళ్ళీ కోట్ల రూపాయలు ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరే అయిందని అర్ధమవుతోంది. అందువల్ల బహుశః ఇప్పడు కూడా మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం ఆయే అవకాశాలు కనబడుతున్నాయి.

 

ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నివేదికను పక్కనపడేసి, విజయవాడ వద్దనే రాజధాని నిర్మించాలనే తన నిర్ణయాన్ని అమలుచేయడానికి సిద్దపడినట్లయితే, రాయలసీమలో మళ్ళీ ఆందోళనలు మొదలవడం తధ్యం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏవిధంగా ఇబ్బంది పెట్టాలా అని ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలు ఇదే అదునుగా ఈ సున్నితమయిన అంశంపై కూడా రాజకీయాలు చేయకామానవు. ఏ పార్టీ అధికారం చేప్పట్టినా తనకు మంచిదనిపించిన నిర్ణయమే తీసుకోవాలనుకొంటుంది తప్ప ప్రతిపక్షాలు చేసే రాజకీయాలకు బయపడి ఏదోఒక నిర్ణయం తీసుకోబోదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, తెలంగాణాలో తెరాస పార్టీలు కూడా అదేపని చేస్తున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా తప్పు పట్టడానికి లేదు. కానీ గతంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా యూపీయే ప్రభుత్వం మొండిగా రాష్ట్ర విభజన చేసిందని ఆరోపించిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సరిగ్గా అటువంటి పరిస్థితినే ఎదుర్కోనబోతున్నారు గనుక సున్నితమయిన ఈ వ్యవహారాన్ని అంతే నేర్పుగా వ్యవహరించి పరిష్కరించవలసి ఉంటుంది. లేకపోతే రాష్ట్రంలో మళ్ళీ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ వేర్పాటు ఉద్యమాలు మొదలయ్యే ప్రమాదం ఉంది.

 

రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి భూసేకరణ కోసం ఏవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు, శాసనసభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించిందో, అదేవిధంగా రాయలసీమ అభివృద్ధికి ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, యంపీలతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని అత్యవసరంగా ఏర్పాటు చేసి రాజధాని కోసం పోరాడుతున్న వారితో చర్చలు జరిపి వారికి పూర్తి భరోసా కల్పించగలిగినట్లయితే సమస్యలు పూర్తిగా ముదరకుండా నివారించవచ్చును. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏమేమి చేయబోతోందో గట్టిగా ప్రచారం చేయడం, దానిని వీలయినంత త్వరగా కార్యరూపంలో పెట్టడం కూడా మంచి ఫలితాలు ఈయవచ్చును. అదేవిధంగా ప్రతిపక్షాలు చేసే రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవడమె అన్నివిధాల ఉత్తమం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు ఏవీ చేప్పట్టకుండా మొండిగా ముందుకు సాగినట్లయితే మళ్ళీ అవే పరిస్థితులు పునరావృతం కాక తప్పదు.

 

ఇదివరకు సున్నితమయిన రాష్ట్ర విభజన అంశం కేంద్రం చేతిలో ఉన్నప్పుడు దానిని సరిగ్గా పరిష్కరించలేదని చంద్రబాబు ఆరోపించేవారు. ఇప్పుడు అటువంటి సున్నితమయిన రాజధాని  అంశాన్ని ఆయనే స్వయంగా పరిష్కరించవలసి ఉంది. ఇది ఆయన సమర్ధతకు అగ్నిపరీక్ష వంటిదేనని చెప్పవచ్చును. కనుక దీనిని అందరికీ ఆమోదయోగ్యంగా ఆయన ఏవిధంగా పరిష్కరించి చూపుతారో వేచి చూడాలి.