బాపు బొమ్మల కొలువు ముగిసింది




గీతకి, రాతకి, బొమ్మకీ, సినిమాకి నిండయిన తెలుగుదనం అద్ది, తెలుగు సంస్క్రతి సంప్రదాయాల రంగుహంగులద్ది ఒక అపురూపమయిన రూపమిచ్చిన బాపు ఇకలేరు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం చెన్నైలో మల్హర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. బాపూ గీత, బాపు అక్షరం, బాపు బొమ్మ బాపు చిత్రం ఇలా ప్రతీదానిపై ఆయన ముద్ర స్పష్టంగా కనబడుతుంది. ఆ ముద్రలో నిండుగా కనబడే ఆహ్లాదకరమయిన తెలుగుదనం చూసి పరవశించని తెలుగు వ్యక్తి ఉండరు. బాపు గొప్పదనం గురించి వర్ణించబోవడం కొండను అద్దంలో చూపే ప్రయత్నమే అవుతుంది.

 

బాపు సినీ రంగంలో ప్రవేశించడం ఆయన అదృష్టం అనడం కంటే తెలుగు ప్రజల అదృష్టమని చెప్పడమే బావ్యంగా ఉంటుంది. ఆయన తొలి సినిమా ‘సాక్షి’ తాష్కంట్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడటం ఆయన అపూర్వ ప్రతిభకు తొలి గుర్తింపుగా చెప్పవచ్చును. ఆయన సృష్టించిన సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, సీతా స్వయంవరం, మనవూరి పాండవులు, గోరంత దీపం, అందాల రాముడు, వంశ వృక్షం, పెళ్ళిపుస్తకం, మిస్టర్ పెళ్ళాం, శ్రీరామరాజ్యం సినిమాలు ఆయనకు, అందులో పనిచేసిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు కూడా ఎనలేని కీర్తి ప్రతిష్టలు కల్పించాయి.

 

ఆయన కుంచె నుండి జాలువారిన బొమ్మలు అచ్చ తెలుగుదనానికి ప్రతిరూపాలుగా నిలిచి పోతాయి. ‘బాపు బొమ్మలా అందంగా...’ ‘అందమయిన బాపు బొమ్మలా....’ అనే చిర పరిచితమయిన వర్ణనలు బాపు బొమ్మ ప్రామాణికతను తెలియజేస్తోంది. తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాపింపజేసిన బాపు తను వచ్చినపని అయిపోయినట్లు తన బొమ్మల కొలువు కట్టిపెట్టేసి కానరాని లోకాలకు తరలిపోయిన తన ఆప్తమిత్రుడు ముళ్ళపూడి వెంకట రమణను వెతుకొంటూ వెళ్ళిపోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu