ప్రపంచ కప్ నుండి వైదొలగిన శ్రీలంక
posted on Mar 18, 2015 6:16PM
.jpg)
ఈరోజు శ్రీలంకకు రెండు చేదు జ్ఞాపకాలు మిగిలాయి. వాటిలో మొదటిది: దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో ప్రపంచ కప్ పోటీల నుండి వైదొలగవలసిరావడం. రెండవది అంతకంటే బాధాకరమయినది. ఇంత కాలం శ్రీలంక క్రికెట్ కు మారుపేరుగా నిలిచిన కుమార్ సంగక్కర మరియు మహేలా జయవర్దనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం. సిడ్నీలో జరిగిన నాకవుట్ మ్యాచులో తమ టీం అత్యంత పేలవంగా ఆడి, దక్షిణాఫ్రికా చేతిలో అతిఘోరంగా ఓడిపోవడంతో తీవ్ర కలత చెందిన వారిరువురూ మ్యాచ్ ముగిసిన తరువాత తామిరువురు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ మెంట్ అవుతున్నట్లు ప్రకటించారు.
సంగక్కర తాను వన్ డే ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించగా జయవర్దనే తను అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. తమ టీం ఓటమి, అదే సమయంలో తమ అభిమాన క్రికెటర్లు ఇరువురూ రిటైర్మెంట్ ప్రకటించడం శ్రీలంకలో క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారిరువురూ లేని శ్రీలంక టీమ్ ని ఊహించుకోవడం కూడా చాలా కష్టమని సచిన్ టెండూల్కర్ అన్న మాటలు అక్షరాల నిజం. సంగక్కర మొత్తం 404 వన్డేలు ఆడారు. 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలతో మొత్తం 14, 234 పరుగులు చేశారు. జయవర్దనే 448 వన్డేలు ఆడి 19 సెంచరీలు, 77 హాఫ్ సెంచరీలతో మొత్తం 12,650 పరుగులు చేశారు.