సైకిల్ పార్టీలో ’అశోక చక్రవర్తి’

పూసపాటి అశోక్ గజపతి రాజు నీతి నిజాయితీ, నికార్సయిన నిండు మనస్సుకు నిలువెత్తు రూపం. టీడీపీ పుట్టిన నాటి నుంచి సైకిల్ పార్టీపైనే సవారీ చేస్తున్న అతి కొద్దిమంది పార్టీ నాయకుల్లో ఆయన ఒకరు. ఆయన మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో... ఆయన మాటకు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుందని ఆయన మనస్సేరిగిన వారు చెబుతారు. కానీ రాజుగారు కదా.. కొద్దిగా కోపం జాస్తి.. అది కూడా జస్ట్ పాలపొంగే అనే వారు కూడా ఉన్నారు. 

మొత్తం 10 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఎనిమిది సార్లు విజయం సాధించారు. ఆ క్రమంలో వాణిజ్య పన్నులు,  ఎక్సైజ్, ఆర్థిక, శాసన సభ వ్యవహారాలు, రెవెన్యూ ఇలా ఏ శాఖా మంత్రిగా పని చేసినా.. అలాగే కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించినా.. ఆయన సింప్లిసిటీ సింప్లిసిటినే. స్వయంగా ఆయన సొంత కారులోనే విజయనగర పుర వీధుల్లో చక్కర్లు కొట్టేస్తారీ అశోక గజపతి రాజుగారు.  

విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా... ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా స్థిత ప్రజ్ఝతను పాటిస్తూ.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహామనిషి ఈ రాజుగోరు అని జిల్లా ప్రజలు చెప్పుకుంటారు. ఎన్నికల్లో సైకిల్ పార్టీ ఓడిందంటే.. అందుకు కారణాలు విశ్లేషించి.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు చెప్పడంలో ఈ రాజుగారు ఘనాపాటి. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ...పార్టీకి సేవలు అందిస్తున్న తీరుపై సైకిల్ పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ఆయనను గౌరవిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. 

ప్రస్తుతం జగన్ ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే మాత్రం.. వాల్మీకి.. దొంగ నుంచి మహార్షిగా మరినట్లు.. వైయస్ జగన్ కూడా మారతారని ప్రజలు భావించి.. ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని.. కానీ దాని పలితం ఇప్పుడు చూస్తున్నామని అశోక్ గజపతి రాజు వ్యంగ్యంగా అంటారు. ప్రస్తుత రాజకీయాలు దిగజారాయా ? అని ప్రశ్నిస్తే మాత్రం రాజకీయాలు దిగజారాయి.. కానీ అవి దిగజారాయి కదా అని మనం దిగజారనవరం లేదని ఈ అశోక చక్రవర్తి క్లియర్ కట్‌గా జవాబు ఇస్తారు. అశోక్ గజపతి రాజు ఎంత పెద్ద రాజుగారు అయినా.. టీడీపీ అధినేత చంద్రబాబు మాటే ఈయనకు వేదవాక్కు అంటే అతిశయోక్తి కాదేమో. ఏపీకి ప్రత్యేక హోదాపై మోదీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంటే..  కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి పదవికీ రాజీనామా చేయమని ఇలా చంద్రబాబు ఆదేశిస్తే.. అలా రాజీనామా చేసిన అశోక చక్రవర్తి ఈ పూసపాటి వారు.    

మాన్సాస్ ట్రస్ట్ అంటే మహారాజా అలక్ నారాయణ సొసైటి ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్. దీనిని అశోక్ గజపతి రాజు తండ్రి  పీవీజీ రాజు.. 1958, నవంబర్ 12న స్థాపించారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 14800 ఎకరాల భూమి ఈ ట్రస్ట్ కింద ఉంది.  తమిళనాడులోని చెన్నైలో సైతం ఈ ట్రస్ట్‌కు భారీగా భూములు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూముల విలువ అనధికారికంగా 50 వేల కోట్ల రూపాయిలపైనే ఉంటుందని ఓ అంచనా.

ఇక సింహాచలంలోని శ్రీ వరాహా లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంతోపాటు మరో 107 దేవాలయాలు ఈ ట్రస్ట్ కింద ఉన్నాయి. ఇక ఎల్ కే జీ నుంచి పీజీ వరకు  12 విద్యా సంస్థలను సైతం ఈ మాన్సాస్ ట్రస్ట్ నడుపుతోంది. ఉత్తరాంద్రలో  వేల మంది విద్యార్థులకు ఈ విద్యా సంస్థలు విద్యను అందిస్తున్నాయి. భారత మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి సైతం ఈ విద్యాసంస్థల్లోనే చదువుకున్నారు. 

అయితే ఈ మాన్సాస్ ట్రస్ట్‌కు గతంలో పీవీజీ రాజు ఛైర్మన్‌గా ఉండే వారు. ఆయన మృతితో అశోక్ గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతి రాజు ఆ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2016లో మరణించడంతో అశోక్ గజపతి రాజు చైర్మన్‌ అయ్యారు. అయితే వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అశోక్ గజపతి రాజు నేతృత్వంలోని మాన్సాస్ ట్రస్ట్‌ కమిటీని రద్దు చేసి... అనంద గజపతి రాజు కుమార్తె సంచయితను తెరపైకీ తీసుకు వచ్చి.. ఆమెకు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌ పీఠాన్ని అప్పగించారు. అందుకు జగన్ ప్రభుత్వం జీవో 72ను జారీ చేసింది. దాంతో అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించడంతో.. సదరు జీవో 72ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు మళ్లీ ఈ అశోకుడుకే దాఖలు పడ్డాయి.

అయితే జగన్ ప్రభుత్వం.. విశాఖను ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా చేసుకుని పరిపాలన సాగించాలని నిర్ణయించింది. ఆ క్రమంలో మాన్సాస్ ట్రస్ట్ భూములపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ అండ్ కో కళ్లు పడ్డాయని.. అందుకే సంచయితను వైయస్ఆర్ సీపీ నేత విజయసాయిరెడ్డి తెరపైకీ తీసుకు వచ్చారనే టాక్ అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. 

అయితే ఈ అంశం చిచ్చుబుడ్డిలా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత తుస్సు మంది. దీంతో వ్యక్తిగతం కానీ... రాజకీయంగా కానీ ఒక్క అవినీతి మచ్చ లేని విజయనగరం పూసపాటి  అశోకగజపతి రాజా వారు నిజంగా రాజుగారే అని ఇప్పటికీ అటు టీడీపీలో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ టాక్ వైరల్ అవుతోంది.