సోనియమ్మ.. అంత పెద్ద మాటలెందుకమ్మా

 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి కాంగ్రెస్ నేతలు చేసే రచ్చ అంతా ఇంతాకాదు. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి లలిత్ మోదీ విషయంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ లో ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 25 ఎంపీలను 5 రోజులపాటు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ ఎంపీలను సస్పెండ్ చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు కట్టుకొని నిరసనలు చేస్తున్నారు. అయితే సోనియాగాంధీ చేస్తున్న ఉద్యమానికి అటు మద్దుతు సంగతి పక్కన బెడితే పాపం విమర్శించేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. వాళ్లు చేసే విమర్శల్లో నిజంకూడా లేకుండా పోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు తెలుగు ప్రజలను విడగొడుతూ అతి దారుణంగా రాష్ట్ర విభజన చేసిన సోనియాగాంధీ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ విమర్శల బాణాలు విసురుతున్నారు.

 

 

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో వ్యవహరించిన తీరు చూస్తే అప్పుడు తప్పు అనిపించని సోనియాగాంధీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేస్తే ఇప్పుడు తప్పునిపిస్తుందా అని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. తమ పార్టీ ఎంపీలను ఏదో 5 రోజులపాటు సస్పెండ్ చేసినందుకు ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆమె అరిచిగీపెడుతున్నారు. రాష్ట్ర విభజన చేసేప్పుడు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్న ఏంపీలను సస్పెండ్ చేసి.. తలుపులు మూసేసి ఆఖరికి మీడియా కూడా ఆపేసి బిల్లును పాస్ చేసినప్పుడు సోనియాకు అప్పుడు తను ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేశారని గుర్తకు రాలేదేమో. ఆఖరికి తన పార్టీ ఎంపీ అయిన లగడపాటి రాజగోపాల్‌ను సైతం పార్లమెంట్ నుండి బయటకు పంపించి మరీ రాష్ట్రాన్ని విడదీశారు. రాష్ట్రంలో మొత్తం 8 కోట్ల మంది తెలుగు ప్రజలను వారి పార్టీ ప్రయోజనాల కోసం రాజకీయ కుతంత్రాలు చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నా మరోవైపు ఏపీ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్లు జనాభా రాష్ట్రాన్ని విడదీయొద్దు అంటూ ఎన్ని ఆందోళనలు చేశారో.. మూడు నెలలు పాటు అందరూ వారి పనులు మానుకొని రోడ్ల మీదకొచ్చి మరీ అంత పోరాటం చేసినా ఏదో బర్తడే కేక్ కట్ చేసి తలో ముక్క ఇచ్చినట్టు కూడా రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడదీసిన సోనియాను ఏమనాలి.

 

అందుకే దీనికి సరైన రీతిలో కాంగ్రెస్ ను చిత్తు చిత్తుగా ఓడించి అధికారం లేకుండా చేశారు. ఇంక కొన్ని సంవత్సరాలు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం అయితే ఎవరికీ లేదు. అయినా వీళ్లు మాత్రం మారారా అంటే మారలేదు. పైగా ఇప్పుడు రైతు ఆత్మహత్యలకు గాను రైతు భరోసా యాత్రలు చేయడం.. అసలు గత పదేళ్ల ప్రభుత్వ హయాంలో ఎన్నడూ రైతు హత్యల గురించి మాట్లడని రాహులు ఈ యాత్రలు చేయడం ఎవరిని మభ్యపెట్టడానికి అని రాజకీయ వర్గాలు కూడా మండిపడ్డాయి. ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీకి తాము తప్పు చేసింది తెలియదు కాని ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం చేసింది తప్పని గగ్గోలు పెడుతుంది. అప్పుడు తప్పుకానిది ఇప్పుడు తప్పుకాదా? అప్పుడు ప్రజాస్వామ్యం కూనీ కాలేదు కాని ఇప్పుడు కూనీ అయ్యిందా? వాళ్లు చేస్తే న్యాయం అనిపించింది ఇప్పుడు అన్యాయం అనిపిస్తుందా? ఇలా అనుకుంటే ఎన్నోప్రశ్నలు తలెత్తుతాయి. కాబట్టి సోనియా గాంధీ గారు ధర్నా చేస్తే చేశారు కాని.. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు.. ఇది అన్యాయం అంటు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుంటే చాలు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu