సీతారామ ప్రాజెక్టు నీటి విడుదల.. ఖమ్మం జిల్లా రైతుల ఆనందం
posted on Jul 12, 2025 6:49PM

గోదావరి జలాల పై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది .. ఈనేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే పనిలో ఉభయ రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి.. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించే ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్ ప్రారంభించింది.. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే గోదావరి జలాలను ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు కు తరలించేందుకు శనివారం సీతారామ ప్రాజెక్టులో భాగంగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద ఏర్పాటుచేసిన ఎత్తిపోతల నుంచి ఒక మోటారు ఆన్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటపడి సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించే పనులను పూర్తిచేశారు.
ప్రస్తుతం గోదావరికి వరద ఉద్ధృతంగా వస్తోంది. మరో వైపు పాలేరు వద్ద అండర్ టన్నెల్ గత ఏడాది కూలిపోయింది.. దీంతో సాగర్ జలాలు ఖమ్మం జిల్లాలోని పంటపొలాలకు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. మరో పదిరోజులు వరకు నీరు రాని పరిస్థితి. దీనివల్ల తల్లాడ, కల్లూరు మేజర్ల కింద పొలాలు ఎండిపోతున్నాయి.. దీనిని దృష్టిలో పెట్టుకొని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు కింద కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన మోటార్లలో ఒక దానిని శనివారం ఆన్ చేశారు. దీనివల్ల గోదావరి జలాలు ఏన్కూరు వద్ద సాగర్ కాలువ లో ప్రవేశించి తల్లాడ, కల్లూరు మేజర్ల కింద ఉన్న సుమారు 30వేల ఎకరాల్లో ఉన్న వరిపంటను రక్షించేందుకు అవకాశం ఉంది. సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోయినప్పటికీ అవకాశం ఉన్న మేరకు మోటార్లు బిగించి ఖమ్మం జిల్లా రైతును ఆదుకోవడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి అభినందనీయమని రైతులు తెలిపారు.