మాజీ డీజీపీ పాత్ర వుంది.. ఎంపీ విశ్వేశ్వర రెడ్డి ఆరోపణ

నమ్మలేని నిజాలు బయటకు వస్తున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో  ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్ దూకుడు పెంచింది.  పాత చిట్టాకు కొత్తగా యాడవుతున్న  ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరినీ పిలిచి వాగ్మూలాలను   నమోదు చేస్తోంది. సిట్ నిజానికి, ఇంతవరకు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారనే విషయంలో సిట్ కు కూడా స్పష్టత లేదని అంటున్నారు. అందుకే ఇంతవరకు ట్యాపింగ్ బాధితుల్లో లేని రెండు మీడియా సంస్థల  ఎండీలకు సిట్ తాజాగా నోటీసులు ఇచ్చింది. , ఈ లెక్కన రేపు ఇంకెవరికైనా నోటీసులు వచ్చినా రావచ్చని అంటున్నారు. ఒక్క పక్షం రోజుల్లోనే 600 పై చిలుకు మంది రాజకీయ నాయకులు, నాయకుల అనుచరులు, నాయకుల వ్యక్తిగత సిబ్బంది ఫోన్లతో పాటుగా మొత్తం 4000 ఫోన్లు ట్యాప్ చేసిన సంఘటన దేశ చరిత్రలోనే కాదు, ప్రప్రంచ చరిత్రలోనూ బహుశా ఉండక పోవచ్చని అంటున్నారు. అలాగే.. ఇంత యథేచ్చగా ఫోన్లు ట్యాప్ చేసిన దుర్వ్యవస్థ కూడా బహుశా ప్రపంచంలో ఎక్కడ ఉండక పోవచ్చని అంటున్నారు.

అదొకటి అయితే..  ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుల విచారణలో ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సిట్ బృందం గుర్తించింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్‌మెంట్‌లను సిట్ బృందం రికార్డ్ చేస్తోంది. ఇప్పటి వరకు 257 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్‌మెంట్‌లను సిట్ రికార్డ్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది నాయకుల ఫోన్ నెంబర్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసింది.  4200లకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు.  రాజకీయనాయకులు,  గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, మీడియా, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ తేల్చింది. 

కాగా.. ఈ శుక్రవారం(జూన్ 27) ) బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి  జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులకు తన వాంగ్మూలం ఇచ్చారు.  ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు.  2023 నవంబర్‌లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సిట్ విచారణకు హాజరైన  సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా సిట్ అధికారులు చూపించారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చానని చెప్పారు.  బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎంపీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిపై ఇంతవరకు ఎవరూ చేయని సంచలన ఆరోపణలు చేశారు. గత డీజీపీ మహేందర్‌రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. తన ఆఫీస్‌లో వారెంట్ లేకుండా వచ్చి కొందరు పోలీస్ అధికారులు దౌర్జన్యం చేసి.. ఫోన్ ట్యాపింగ్ చేశారని వెల్లడించారు. అలాగే, ఎన్నికల సమయంలో తనతో పాటు తన అనుచరుల కదలికలను కూడా పసిగట్టారని చెప్పారు. తన స్నేహితుడు బంగారం కొన్న రూ.72 కోట్లను పోలీసులు పట్టుకున్నారనీ,  అవి తన డబ్బులు అన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.

మరోవంక..  మరో బీజేపీ ఎంపీ, రఘునందన రావు, దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని.. మొట్ట మొదటిసారిగా తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని డీజీపీకి అనేక సార్లు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధంలేని కాంగ్రెస్ నాయకులను సిట్ పిలుస్తోందని..  దుబ్బాక ఉప ఎన్నికల్లో తన ఫోన్   ట్యాపింగ్ అయ్యింది, తనను అడిగితే  అన్ని వివరాలు ఇచ్చే వాడినన్నారు.  ఫోన్ ట్యాపింగ్‌లో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవని,  కాంగ్రెస్, బీఆర్ఎస్ మూలాఖత్ అయ్యాయని విమర్శించారు. ఫిర్యాదు చేసిన తమను సిట్ ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. రోజుకు ఒక్కరిని మాత్రమే విచారణ చేయడానికి ఇదేమైనా డైలీ సీరియలా అని ప్రశ్నించారు. నిజంగా కూడా, జరుగుతున్న తంతు చూస్తే, ఇదొక డెయిలీ సీరియల్ లానే నడుస్తోందని అంటున్నారు.