సింగరేణి దొంగలకు తాళాలు అప్పగిస్తున్న ప్రభుత్వం?

దొంగలకే తాళాలు అప్పగిస్తే అనే పెద్దల మాటను తూ.చ. తప్పకుండా ప్రభుత్వం అనుసరిస్తోంది. సింగరేణి పరిశ్రమలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన వారందరికీ పదోన్నతులు కల్పించి బదిలీ చేసిన ఘనత కూడా ప్రభుత్వానికే దక్కింది. సిఎండి సంతానం, శాస్త్రి పని చేసిన కాలంలో అతిపెద్ద కుంభకోణాలు వెలుగుచూశాయి. వీరిద్దరూ ప్రధానపాత్రధారులనీ తేలింది. అప్పట్లో ప్రభుత్వం నియమించిన రాంరెడ్డి కమిషన్‌ నివేదిక ఇప్పటిదాకా వెలుగుచూడలేదు. 1995లో గోదావరి ఖని ఓసీ`2లో టెక్నాలజీ కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపణ వచ్చింది. దీనిపై శాసనసభాకమిటీ వేశారు. ఆ కమిటీ 150మంది అధికారులపై ఆరోపణలను విచారించి 27మందిని దోషులుగా తేల్చింది. ఇప్పటి వరకూ ఆ దోషులపై చర్యలు తీసుకోలేదు. సింగరేణి డైరెక్టర్‌ పర్సనల్‌గా అయ్యంగార్‌ సీఎస్‌ఎల్‌ ట్యూబ్‌లైట్ల కొనుగోలులో కోట్లరూపాయల కుంభకోణం వెలుగుచూసింది. ఆయన్ని బదిలీ చేశారు. ఆ తప్పుపై కనీసం విచారణ కూడా నిర్వహించలేదు. గోదావరి ఖని 7ఎల్‌ఈపీ, జీడీకే 8ఏ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయిన ఘటనలపై జస్టిస్‌ బిలాల్‌ నక్వీ విచారణ కూడా వెలుగులోకి రాలేదు.

 

తాజాగా సత్తుపల్లి ఓసీలో బొగ్గుగ్రేడ్‌ మార్చి అమ్మిన కుంభకోణం 2005`2011 మధ్యన వెలుగుచూసింది. దీనికి కారణమైన డైరెక్టర్‌ సింగరేణి వదిలి వెళ్లిపోయారు. దర్జాగా విదేశాల్లో ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఇదే కుంభకోణంలో పాత్రధారులైన కొందరికి పదోన్నతులు లభించాయి. గోదావరి ఖని మేడిపల్లి ఓసీలో వెలుగుచూసిన మరో కుంభకోణంపై ప్రధుత్వ ప్రధానకార్యదర్శి విచారణ ప్రారంబించారు. ఈ విచారణ న్యాయంగా జరగాలని కోరుతూ తానేమీ నేరం చేయలేదని ఒక డైరెక్టర్‌ ఇటీవలే సీఎస్‌కు రాశారని సమాచారం. భూపాలపల్లిలో సత్తుపల్లి తరహాలోనే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిలో దోషులనైనా శిక్షిస్తారో? క్షమిస్తారో వేచి చూడాలి. అసలు ఇన్ని కుంభకోణాలు వరుసగా వెలుగులోకి వచ్చినా దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారో అన్న అంశంలోనే దొంగలకు తాళాలు అప్పగించే వైఖరి బయటపడుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu