క్షమాభిక్ష కోరుతూ కసబ్ పిటిషన్
posted on Sep 18, 2012 4:57PM
ముంబాయిలో దాడులకు తెగబడిన పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్ తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పిటిషన్ దాఖలు చేశారు. కాగా ముంబైలో నరమేధం సృష్టించిన కసబ్‌కు ఉరిశిక్షే సరైనదని 15 రోజుల క్రితం భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజ్ హోటల్లో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక ఉగ్రవాది కసబ్. కసబ్ కేసు విషయంలో 11వేల పేజీలతో దర్యాఫ్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసింది. 13 నెలల పాటు దర్యాఫ్తు సంస్థ ఈ కేసును విచారించింది. 3192 సాక్ష్యాధారాలను పరిశీలించింది. 2009 ఏప్రిల్ 15వ తేదిన కసబ్ కేసు ప్రారంభమైంది. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. దేశంలోని ఉగ్రవాదుల కేసులలో అత్యంత వేగంగా పూర్తయిన కేసు కసబ్‌దే. ప్రస్తుతం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద 11 క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హంతకుడు బల్వంత్‌సింగ్ రాజోనా క్షమాభిక్ష పిటిషన్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్ద ఉండగా, పార్లమెంటుపై దాడుల కేసులో దోషి అయిన అఫ్జల్ గురు క్షమాభిక్ష సహా 11 పిటిషన్‌లు రాష్ట్రపతి భవన్‌లో నిరీక్షిస్తున్నాయి. సమాచార హక్కుచట్టం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.