పారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన సింధు ప్రస్థానం.. చైనా షట్లర్ చేతిలో ఓటమి
posted on Aug 2, 2024 7:14AM
పారిస్ ఒలింపిక్స్ లో తెలుగుతేజం, భారత ఏస్ షట్లర్ పీవీ సింధు ప్రయాణం ముగిసింది. వరుసగా మూడో ఒలింపిక్స్ లోనూ పతకం సాధించాలన్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. రియో ఒలింపిక్స్ లో రజతం, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సింధు పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగింది. అయితే క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఈ సారి చైనా గోడను బద్దలు కొట్టడంలో విఫలమైంది. గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సింధూ.. చైనా క్రీడాకారిణి హే బిన్‌జియావో చేతిలో 19-21, 14-21తో ఓటమి చవిచూసింది.
తొలి గేమ్‌లో గెలిచే అవకాశం చేజార్చుకున్న సింధు ఆ తరువాత పుంజుకోలేకపోయింది. మ్యాచ్ ఆరంభంలోనే ఒత్తిడికి లోనైన సింధూ 1-5తో వెనకబడింది. ఆ తరువాత పుంజుకుని ప్రత్యర్థితో అంతరాన్ని 10-11కు తగ్గించింది. అనంతరం, చైనా క్రీడాకారిణి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో సింధూ కోలుకోలేకపోయింది. ఇక రెండో గేమ్‌లో బిన్‌జియావో సింధుపై పూర్తి ఆధిపత్యం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ ఇదే బిన్‌జియావోను ఓడించి కాంస్య పతకాన్ని సాధించడం గమనార్హం.