తెలంగాణలో ఒకేరోజున ఏడుగురు రైతుల ఆత్మహత్య
posted on Oct 17, 2014 11:45AM
.jpg)
తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గురువారం నాడు తెలంగాణలో మొత్తం ఏడుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం నాడు నిజామాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో మొత్తం ఏడుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ గ్రామానికి చెందిన రైతు పట్లోల త్రిశూల్ రెడ్డి (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండకు చెందిన రైతు ఎడమ సాంబరాజు (27), నర్మెట మండలం తరిగొప్పుల గ్రామానికి చెందిన రైతు పాలబోయిన పోషయ్య (45), మెదక్ జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లికి చెందిన రైతు లేళ్ళ నరసింహులు (40), చిన్న శంకరంపేట మండలం జప్తి శివనూర్ గ్రామానికి చెందిన ఎం.ఆశయ్య (45), జగదేవపూర్ మండలం చేబర్తి నర్సన్నపేటకు చెందిన రైతు బుకల కొండయ్య (40), కరీంనగర్ జిల్లా రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎడవెల్లి సంపత్ (22) ఆత్మహత్యలు చేసుకున్నవారిలో వున్నారు. కరెంటు కోతల వల్ల పంట దిగుబడులు రాకపోవడం, అప్పులు పెరిగిపోవడం వల్ల ఈ ఏడుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.