కమలం గూటికి శశి థరూర్?
posted on May 3, 2025 12:53PM
.webp)
ప్రధాని వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ సొంత పార్టీలో అంత సుఖంగా లేరన్న ప్రచారం చాలా చాలా కాలంగా జరుగుతోంది. ఒక దశలో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని జాతీయ మీడియాలో కథలు, కథనాలు చాలానే వచ్చాయి. కథలు, కథనాలు రావడం ఒకెత్తు అయితే.. స్వయంగా ఆయనే కాంగ్రెస్ పార్టీ తనను పక్కన పెట్టిందని ఆరోపించారు. ఇంకో అడుగు ముందుకేసి, నేను కాంగ్రెస్ కు అవసరం అనుకుంటే కాంగ్రెస్ లో ఉంటాను అవసరం లేదనుకుంటే నా ముందు చాలా ప్రత్యన్మాయాలున్నాయి అంటూ సంచలన ప్రకటన కూడా చేశారు. అయితే.. ఆయన రాజకీయ ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడారా.. లేక రచనా వ్యాసంగం, ఉపన్యాసాల వంటి ఇతర అంశాల గురించి మాట్లాడారా? లేక రెండింటి గురించి మాట్లాడారా అనే విషయంలో ఆయన క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.
అదెలా ఉన్నా.. గత కొంత కాలంగా శశి థరూర్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్న సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా ఆయన బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు మరింత క్లియర్ గా కనిపిస్తున్నాయని అంటున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో సెల్ఫి తీసుకోవడం, ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోదీ అనుసరించిన విధానాన్ని తాను తప్పుగా అర్థం చేసుకున్నానని క్షమాపణలు చెప్పడం వంటి అనేక పరిణామాలు, సంఘటనలు శశి థరూర్ బీజేపీకి దగ్గరౌతున్నారనే వాదానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఇదలా ఉంటే.. ప్రధాని మోదీ తాజా కేరళ పర్యటన శశి థరూర్ ను బీజేపీకి మరింత దగ్గర చేసిందని అంటున్నారు. అన్తునంరు. ముఖ్యంగా తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ప్రతిష్ఠాత్మక విఝింజమ్ అంతర్జాతీయ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీపోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశ మయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేరళ ముఖ్య మంత్రి పినరన్ విజయన్, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో శశి థరూర్ ఉన్నారు, ఇది కొందరి నిద్రను భంగం చేస్తుందని అన్నారు. నిజానికి, ప్రధాని మోదీ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో కానీ.. చాలా కాలంగా శశి థరూర్ బీజేపీలో చేరుతున్నారనే వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని లేపాయి. అంతే కాకుండా.. శశి థరూర్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ప్రధాని మోదీకి స్వాగతం పలకడంతో పాటు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ సమయానికి చేరుకుని తన నియోజకవర్గానికి వచ్చిన ప్రధానికి స్వాగతం పలికానని సంతోషం వ్యక్తపరిచారు. దీంతో శశి థరూర్ బీజేపీలో చేరారా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
నిజానికి సొంత నియోజక వర్గానికి వచ్చిన ప్రధానికి స్థానిక ఎంపీ స్వాగతం పలకడం పెద్ద విషయం కాదు, అలాగే.. ప్రధాని మోదీ సరదాగా చేసిన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు. అయితే.. గత కొంతకాలంగా శశిథరూర్ కాంగ్రెస్ అధినాయకత్వంతో సఖ్యతగా లేరని, పార్టీలో ఆయన పాత్రపై అసంతృప్తితో ఉన్నారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ విషయం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే.. కేరళ ముఖ్య మంత్రి పదవిని ఆశిస్తున్న శశిథరూర్ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. వచ్చే సంవత్సరం జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలల్లో తనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారనీ, అందుకు అధిష్టానం నో అందనీ ప్రచారం జరుగుతోంది. అందుకే శశిథరూర్ ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుకొచ్చే వ్యూహంతో పావులు కదుపుతున్నట్లు చెపుతున్నారు. మొత్తానికి ప్రధాని మోదీ కేరళ పర్యటన.. ఆ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మరోసారి శశిథరూర్ కాంగ్రెస్ సంబంధాల పై చర్చను తెరపైకి తెచ్చిందని అంటున్నారు.
మర్కట సందేశం
అదలా ఉంటే.. ఇటీవల శశిథరూర్ తన ఢిల్లీ నివాసంలో బయట గార్డెన్ లో కూర్చుని పేపర్ చదువు కుంటున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక కోతి వచ్చి ఆయన ఒడిలో కూర్చుంది. సిబ్బంది ఇచ్చిన అరిటిపండ్లు తిన్నది. ఆ తర్వాత శశి థరూర్ ఒడిలో ఆ కోతి సేదతీరింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో ఆయనే స్వయంగా పోస్ట్ చేశారు. ఈ అసాధారణ అనుభూతిని ఎక్స్‌లో పంచుకున్నారు. ఈరోజు ఒక అసాధారణ అనుభవం కలిగింది. ఉదయం నేను గార్డెన్‌లో కూర్చొని వార్తాపత్రికలు చదువుతున్నా. ఒక కోతి నేరుగా నా వద్దకు వచ్చింది. నా ఒడిలో కూర్చొంది. రెండు అరటి పండ్లు ఇవ్వగా చాలా ఆకలితో తిన్నది. నన్ను కౌగిలించుకుని నా ఛాతిపై తల ఆనించి నిద్రపోయింది. నేను మెల్లగా పైకి లేవగా కిందకు దూకి అక్కడి నుంచి వెళ్లిపోయింది అని పేర్కొన్నారు. మరోవైపు శశి థరూర్ ఒడిలో కోతి కూర్చోవడం, అరటి పండ్లు తినడం, ఆ తర్వాత ఆయనను హత్తుకుని నిద్రించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కొందరు శశి థరూర్ పార్టీ మారాలని ఆ కోతి మర్కట సందేశం ఇచ్చిందని అంటున్నారు.