కొత్త పైత్యం.. సెల్ఫీ షూ
posted on Apr 9, 2015 2:17PM

ఈమధ్యకాలంలో సెల్ఫీల గోల ఎక్కువైపోయింది. చేతిలో ఫోన్ వుండటం ఆలస్యం.. వెంటనే సెల్ఫీ తీసేసుకోవాలని అనిపించడం మామూలైపోయింది. ప్రస్తుతం సెల్ఫీ అనేది ఇందుగలదు అందు లేదనే సందేహం అక్కర్లేని సర్వాంతర్యామి అయిపోయింది. మొన్నటి వరకూ చేత్తోనే సెల్ఫీలు తీసుకునేవారు. రీసెంట్‌గా సెల్పీ స్టిక్కులు అందుబాటులోకి వచ్చాయి. పర్సులో పట్టేంత సెల్ఫీ స్టిక్ వుంటుంది. ఆ స్టిక్‌ని తీసి బయటకి లాగితే బారెడు స్టిక్కులా మారుతుంది. చివర్లో ఫోన్ పెట్టే ఏర్పాటు కూడా వుంటుంది. ఇప్పటి వరకు సెల్ఫీల శాస్త్రంలో ఈ స్టిక్కే హైలైట్ అనుకుంటుంటే, ఇప్పుడు ఇందులో మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్‌గా సెల్ఫీ షూస్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే మన ఇండియా మార్కెట్లో కాదు.. అమెరికాలాంటి దేశాల్లో సెల్ఫీ షూలకి డిమాండ్ బాగా వుంది. మనం తొడుక్కునే షూలకి సెల్‌ఫోన్ పెట్టడానికి వీలుగా ఖాళీ ప్రదేశం కూడా వుంటుంది. అందులో సెల్‌ఫోన్ పెట్టేసి కాలితో సెల్ఫీ తీసుకోవచ్చు. ఈ కొత్త పైత్యం యూత్‌కి బాగా నచ్చినట్టుంది... ప్రస్తుతం సెల్ఫీ షూలు బాగా అమ్ముడుపోతున్నాయి. మరి ఈ షూలు మన ఇండియా మార్కెట్ని ఎప్పుడు పావనం చేస్తాయో మరి!