చంద్రబాబుకుభద్రత పెంపు
posted on Aug 26, 2022 11:16AM
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జీ భద్రత పెంచింది. గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ సిబ్బంది ఉండగా.. నేటి నుంచి అదనంగా నలుగుర్ని నియమించినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 12మంది చంద్రబాబుకు సెక్యూరిటీ ఇవ్వనున్నారు. అంతే కాదు గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షించనున్నారు.
అంతేకాదు గురువారం ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమరదీప్ సింగ్ టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఉండవల్లి నివాసాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇక కుప్పంలో చంద్రబాబుకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.గురువారం ఆగస్టు 25) కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు ప్రారంభించనున్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడం, ఫ్లెక్సీలను చించివేయడమే కాకుండా చంద్రబాబు సమీపానికి చేరుకోవడానికి ప్రయత్నించడం తో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
దీంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యలో చంద్రబాబు భద్రతకు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎన్ఎస్జీ అభిప్రాయపడింది. గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎన్ఎస్జీ డీఐజీ భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఈ మేరకు ఆయన నివేదికను పరిశీలించిన ఎన్ఎస్జీ అందుకు ఆమోదం తెలిపింది. దీంతో శుక్రవారం(ఆగస్టు 24) నుంచి చంద్రబాబుకు భద్రతను పెంచారు. 12 ప్లస్ 12 ఎన్ఎస్జీ బృందం ఆయనకు రక్షణ కవచంగ నిలవనుంది.