ఆ ఎన్నికలు నావల్ల కాదు..
posted on Mar 24, 2021 1:16PM
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేతులెత్తేశారు. ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని.. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో తాను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఉత్తర్వులు ఇచ్చారు. 4 వారాల ఎన్నికల కోడ్ విధించాలన్న బాధ్యతనూ నెరవేర్చలేనని అన్నారు. పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడంలో నిమగ్నమై ఉన్నారని ఎస్ఈసీ తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.
మార్చి 31తో తన పదవీ కాలం పూర్తవుతుండటంతో.. నూతన ఎస్ఈసీపైనే బాధ్యతలన్నీ ఉంటాయని చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినవారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని.. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని చెప్పారు. హైకోర్ట్ తీర్పునకు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నామని నిమ్మగడ్డ తెలిపారు. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరమే పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.