జగన్ బ్యాచ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. లిక్కర్ కేసులో కీలక మలుపులు

ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డిని వారం రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. అదే టైంలో  రాజ్ కేసిరెడ్డి  పీఏ దుబాయ్ పరారవ్వడానికి ప్రయత్నిస్తూ దొరికిపోవడంతో ఆ కేసులో  కీలక వ్యక్తుల గుట్టు రట్టవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తాజాగా లిక్కర్ స్కాంకు సంబంధించి జగన్ బ్యాచ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ సీఎం జగన్ మాజీ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్, జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వివరాలు సమర్పించేందుకు ప్రాసిక్యూషన్ సమయం కోరింది. ఈ క్రమంలో ప్రాసిక్యూషన్ సమయం కోరుతున్న నేపథ్యంలో ఈ దశలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

మద్యం స్కాంలో ఇప్పటికే అరెస్ట్ అయిన కొందరు నిందితులు తమ పేర్లు చెప్పారని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దశలో ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా.. మద్యం స్కాం కేసులో లోతుగా విచారణ జరుగుతుండటంతో జగన్ బ్యాచ్‌లో వణుకు మొదలైంది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి, ఆయన పీఏ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసు తమ వరకూ రాబోతోందన్న భయంతో హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్ బ్యాచ్. తమకు అరెస్ట్ లేకుండా చూడాలంటూ ముందస్తు బెయిల్‌కు అప్పీలు చేసుకున్నారు.

జగన్ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ  హైకోర్టులో పిటిషన్‌‌ వేయగా, ఎలాంటి ముందస్తు అరెస్ట్ లేకుండా ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది నుంచి  దర్యాప్తు అధికారులు సమాచారాన్ని రాబట్టారు. మరికొంత మంది విచారణ కూడా జరుగుతోంది. ఈ కేసులో మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. వారికి ఎదురుదెబ్బ తగిలింది.