సుప్రీం కోర్టులో అమరావతి కేసు మరో సారి వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ మరో సారి వాయిదా పడింది. పాలన వికేంద్రీకరణతో పాటు సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జగన్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీని పైన రెండు రోజుల క్రితం చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కుమార్తె అమరావతి రైతుల తరపున వాదిస్తుండటంతో ప్రధాన న్యాయమూర్తి ఆ కేసును నాట్ బిఫోర్ మీ అంటూ మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు. 

 

దీంతో ఈ కేసు ఈరోజు జస్టిస్ నారీమన్ అధ్యక్షతన ఏర్పడిన బెంచ్ ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ కూడా అమరావతి రైతుల తరపున జస్టిస్ నారీమన్ తండ్రి హాజరయ్యారు. దీంతో..నారీమన్ ఈ కేసును మరో బెంచ్ కు వాయిదా వేయాలంటూ నాట్ భిపోర్ మీ అంటూ కేసును మరో సారి వాయిదా వేసారు. 

 

ఐతే ఒకే కేసు విషయంలో సుప్రీం కోర్టు లో వరుసగా రెండో సారి ఇలా జరగటం అరుదైన విషయం అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ పైన మరో బెంచ్ వద్ద విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాల పైన హైకోర్టు ఈ నెల 27వ తేదీ వరకు స్టేటస్ కో అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.