శశికళ కొత్త పార్టీ పెడతారా? అన్నాడీఎంకే చీలిపోనుందా? 

అనుకున్నదే జరిగింది. తమిళనాడు రాజకీయాలలో మరో ఇన్నింగ్స్ ఆడేందుకు చిన్నమ్మ శశికళ మళ్ళీ తెరమీదకు వచ్చారు. జయలలిత మరణం తర్వాత, కాలం కలిసిరాక జైలుపాలైన ఆమె జైలు నించి విడుదలైన తర్వాత రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఇప్పుడు అమ్మ పార్టీని బతికించుకోవడం కోసం అంటూ రీఎంట్రీ ఇచ్చారు. జైలుకు వెళ్ళే సమయంలో ఎక్కడైతే ఆమె శపధం చేశారో, అదే జయలలిత సమాధి నుంచి మరో రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. భారీ అనుచరగణంతో జయ సమాధి వద్ద వచ్చిన శశికళ ‘అమ్మ’ కు ఘనంగా  నివాళులు అర్పించారు. రాజకీయ రీఎంట్రీ వైపు తొలి అడుగు వేశారు.  

అయితే ఇది ఆమె తొలి ప్రయత్నం కాదు. ఇంతకు ముందు కూడా ఆమె పొలిటికల్ రీఎంట్రీ ప్రయత్నాలు చేశారు. ఈ సంవత్సరం (2021) ఏప్రిల్’లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే, రీ ఎంట్రీకి ప్రయత్నించారు. బెంగుళూరు జైలు నుంచి వస్తూనే ... అన్నా డిఎంకే జెండాలతో వందకు పైగా వాహనాలతో రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చారు.ఆలా డైరెక్ట్’గా రాజకీయాల వైపు అడుగులు వేశారు. అయితే, ఆమె ప్రయత్నం ఫలించలేదు. అప్పటికింకా అధికారంలో ఉన్న ఆన్నా డిఎంకే ఆమెకు చెక్ చెప్పింది. అలాగే, జూన్,జూలై నెలల్లో ‘వస్తున్నా ,, వచ్చేస్తున్నా’ అంటూ మరోసారి మరో రాయివేశారు. అది కూడా అంతే ..పేలలేదు. 

ఇప్పుడు సమయం సందర్భం చూసుకుని, శశికళ ముచ్చటగా మూడో ప్రయత్నం చేశారు. రేపు (అక్టోబర్ 17)జరిగే, అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని అందుకు ఒకరోజు ముందు ఈరోజు మెరీనాతీరంలో జయలలిత, ఎంజీఆర్‌ల సమాధులకు నివాళులర్పించారు. ఈసారి అయినా ఆమె ప్రయత్నం ఫలిస్తుందా అంటే, ఆమె తిరిగి అన్నా డిఎంకే’లో కాలు పెట్టడం కష్టమే అంటున్నారు పరిశీలకులు. శశికళ రాకను పార్టీలోని రెండు ప్రాధాన వర్గాలు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి వర్గం, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం .. ఇద్దరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. 

అలాగే తమిళనాడులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న అన్నాడిఎంకే మిత్ర పక్షం, బీజీపీ కూడా శశికళ రాజకీయ పునరాగమనాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె మళ్ళీ అమ్మ పార్టీలో అడుగు పెట్టలేకపోయినా సొంత పార్టీ పెట్టే అవకాశాలను మాత్రం కాదనలేమని అంటున్నారు. అయితే అది లక్ష్మీ పార్వతి పెట్టిన ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీలా ... ఉంటుందా ... ఇంకోలా ఉంటుందా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.