శశికళ విడుదల అయ్యేది 2021 లోనే.. అది కూడా ఫైన్ కడితేనే..
posted on Sep 16, 2020 9:47AM
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే నాయకురాలు అయిన శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నసంగతి తెలిసిందే. శశికళ వచ్చే ఏడాది జనవరి 27న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని.. అయితే, దీనికోసం ఆమె రూ. 10 కోట్లు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని కర్ణాటక జైళ్ల శాఖ తెలిపింది.
శశికళ శిక్షాకాలం, విడుదల తేదికి సంబంధించి ఆర్టీఐ కార్యకర్త, లాయర్ నరసింహమూర్తి చేసిన దరఖాస్తుకు సమాధానముగా పరప్పన జైలు సూపరింటెండెంట్ ఆర్.లత ఈ వివరాలు తెలిపారు. ఒక వేళ ఆమె ఫైన్ కట్టకపోతే మాత్రం 27 ఫిబ్రవరి 2022 వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 2017 లో అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీం కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శశికళ అనుచరురాలు ఇళవరసి అలాగే శశికళ మేనల్లుడు సుధాకరన్ కూడా ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.