అమెరికాలో తెలుగు వైభవం.. 9,500 మంది విద్యార్థులతో సిలికానాంధ్ర మనబడి తరగతులు ప్రారంభం!
posted on Sep 16, 2020 11:16AM

భాషాసేవయే భావి తరాలసేవ అనే నినాదంతో, గత 13 సంవత్సరాలుగా మహాయజ్ఞంలా నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి తరగతులు, 2020-21 నూతన విద్యాసంవత్సరానికి ఈ సెప్టెంబర్ 12 వ తేదీ నుండి దిగ్విజయంగా ప్రారంభమైనాయి! అమెరికాలో 35 రాష్ట్రాలలో 250 కి పైగా కేంద్రాలలో, పదికి పైగా ప్రపంచంలోని ఇతర ఖండాలలోని దేశాలలో ప్రవాసాంధ్ర పిల్లలకు తెలుగుభాష నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడిలో, COVID-19 మహమ్మారి వల్ల మనమంతా అనేక ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ 9,500 కు పైగా విద్యార్థులు ఇప్పటికే నమోదు చేసుకున్నారు!
"పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం" వారి అనుబంధంతో , ప్రతిష్ఠాత్మక ACS-WASC (USA) వారి అధికారిక గుర్తింపు పొంది, 35 స్కూల్ డిస్ట్రిక్టులలో ఫారిన్ లాంగ్వేజ్ (FLC) గుర్తింపు లభించిన ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడి అని, మనబడి అధ్యక్షులు మరియు కులపతి శ్రీ రాజు చమర్తి పేర్కొన్నారు. గత 13 ఏళ్లలో మనబడి ద్వారా 60,000 కు పైగా చిన్నారులకు తెలుగు నేర్పించామని, కరోనా పరిస్థితులలో సైతం ఇన్నవేల మందిని నమోదు చేసినందుకు తల్లిదండ్రులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు! మనబడి విజయాలకు కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు, స్వచ్ఛంద కార్యకర్తలకు కూడా వారు కృతఙ్ఞతలు తెలియజేశారు.

మనబడిలో తెలుగు భాష నేర్పించడం మాత్రమే కాకుండా తెలుగుమాట్లాట పోటీలు, బాలానందం రేడియో కార్యక్రమాలు, తెలుగుకు పరుగు, పద్యనాటకాలు, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో మన పిల్లలకు మన సంసృతీసాంప్రదాయాలతో పాటు, మన కళల పట్ల అవగాహన కల్గించడం మనబడి ప్రత్యేకత!
మీ పిల్లలను ఈ విద్యాసంవత్సరానికి manabadi.siliconandhra.org ద్వారా సెప్టెంబర్ 25 వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని, మనబడి అభివృద్ధి, ప్రాచుర్యం మరియు టెక్నాలజీ విభాగాల ఉపాధ్యక్షులు శ్రీ శరత్ వేట గారు విన్నవించారు. మొదటి త్రైమాసికం తరగతులన్నీ కరోనా పరిస్థితులవల్ల సాంకేతికతను ఉపయోగించి అంతర్జాల మాధ్యమం ద్వారా నిర్వహిస్తారని కూడా వారు తెలిపారు.