సంజయ్ దత్ ఖైదీ నెం.16656
posted on May 23, 2013 2:43PM

ముంబయి పేలుళ్ళ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సినీ నటుడు సంజయ్ దత్ ను మంగళవారం అర్థరాత్రి అత్యంత రహస్యంగా పూనేలోని ఎరవాడ జైలుకు తరలించారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఈ నెల 16న టాడా కోర్టులో లొంగిపోయిన సంజయ్ దత్ 42నెలల జైలు శిక్షను ఇంకా అనుభవించాల్సి ఉంది. దీనికి గాను తొలుత ఆర్థర్ రోడ్డు జైలులోని అండా గదిలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మంగళవారం అర్థరాత్రి అత్యంత రహస్యంగా సంజయ్ ను ఆర్థర్ రోడ్డు జైలు నుంచి తరలించారు. బుధవారం వేకువ జామున గంటలకు సంజయ్ ఎర్రవాడ జైలుకు చేరుకున్నారు. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉండే గదిని ఆయనకు కేటాయించినట్లు సమాచారం. భద్రతా కారణాల వల్లే సంజయ్ ను రహస్యంగా తరలించామని అధికారులు చెప్పారు. జైల్లో సంజయ్‌దత్‌కు అధికారులు 16656 నంబరు కేటాయించారు. ఆయన ఎరవాడ జైలుకు రావడం ఇది మూడోసారి.