అధికారులను బెంబేలెత్తిస్తున్న శాండ్ మాఫియా!
posted on Jul 25, 2012 4:27PM
రాష్ట్రంలోని అన్నిజిల్లాలలోనూ అక్రమ ఇసుక తవ్వకాలు జరుగు తున్నాయి. ఇసుక మాఫియా అధికారులను ఏ మాత్రం ఖాతరు చేయడంలేదనడానికి అనేక ఉదంతాలు వెలుగు చూసాయి. రాజకీయ నేతల సహకారంతో వారు ఇసుక తవ్వకాలను నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. పర్వావరణకు ముప్పువాటిల్లుతున్నా వారు ఏ మాత్రం వెనుకంజ వేయటం లేదు. ఇప్పటికే ఇసుక తవ్వకాల వల్ల నీటి పరిమాణం భూమిలో తగ్గింది. చాలా చోట్ల 700 నుంచి 1000 అడుగుల వరకు బోర్లు వేసినా ఒక్క చుక్క కూడా నీరు అందటంలేదు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇదివరలో 50 అడుగుల లోతులో నీళ్లు పడుతుండగా ఇప్పుడు 250 నుండి 400 అడుగుల లోతుకు వెళ్లవలసి వస్తుంది. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ జరుగుతున్న నిర్మణాలు, సిమెంటురోడ్ల వల్ల నీరు ఇంకిపోదని అందువల్లకూడా రానున్న రోజుల్లో మరింత నీటి కటకట తప్పదని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కురుస్తున్న వర్షపు నీరు భూమి పొరల్లోకి ఇంకాలంటే ఇసుక ప్రాధాన్యత చాలా వుందని వారు చెబుతున్నారు. ఇసుక తవ్వకాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వం మాత్రం నిద్రావస్థనుండి మేల్కోలేదని తెలుస్తుంది. తగింత సిబ్బంది, పర్యవేక్షణ, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.