విభజన వల్లనే సీమంధ్ర ప్రజలు ఆగ్రహిస్తున్నారా

 

రాష్ట్ర విభజన వెనుక కాంగ్రెస్ పార్టీకి అనేక ఆలోచనలుండవచ్చుగాక. కానీ దానివల్ల తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. కానీ, ఆ పార్టీ రాష్ట్ర విభజనకు అనుసరించిన పద్దతితో సీమంధ్ర ప్రజల ఆత్మాభిమానం కూడా దెబ్బతింది. ఇరుప్రాంతల రాజకీయనేతల, పార్టీల వాదనలు, ఎత్తుగడలను పక్కన బెట్టి ఆలోచిస్తే, ఇరుప్రాంతల మధ్య సయోధ్యతో పరిష్కరించవలసిన ఒక సంక్లిష్టమయిన సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం తనదయిన శైలిలోనే పరిష్కరించింది. గత 63రోజులుగా లక్షలాది సీమంధ్ర ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే, కనీసం వారి ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు చిన్నపాటి ప్రయత్నం కూడా చేయకపోవడం వలననే నేడు వారు మరింత ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు.

 

రాష్ట్ర విభజన నిర్ణయం కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తమపట్ల ప్రదర్శించిన అనుచిత వైఖరికే వారి మనసులు గాయపడ్డాయి. ఇటువంటి నిర్ణయాలలో ఒకరికి సంతోషం మరొకరికి బాధ కలగడం సహజమే అనుకొన్నపటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం సీమంధ్ర ప్రజలపట్ల సరయిన విధంగా స్పందించి ఉంటే కనీసం వారిలో ఆ బాధను కొంత మేరయినా తగ్గించగలిగేది. కానీ, కాంగ్రెస్ తన సహజ సిద్దమయిన ఉదాసీన వైఖరి, నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ సమస్యను పరిష్కరించాలనుకోవడం చేతనే నేడు సీమంధ్ర ప్రజలు ఇంత ఆగ్రహావేశాలు చూపుతున్నారు.

 

కాంగ్రెస్ వారితో ప్రవర్తించిన తీరుతో వారు కాంగ్రెస్ ప్రభుత్వం చేత తిరస్కరింపబడి, అవమానింపబడినట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా ప్రజల అహంపై దారుణంగా దెబ్బ తీసింది. మీడియా ముందుకి వచ్చి మాట్లాడుతున్నప్రజలలో ఇదే భావన ప్రస్పుటంగా కనిపిస్తోంది.

 

అయితే, రానున్న ఎన్నికలలో పార్టీపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిసిఉన్నపటికీ, కాంగ్రెస్ పార్టీకి తన వ్యూహాలు తనకు ఉండటం చేతనే ఉద్యమిస్తున్న ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ముందుకు సాగగలిగిందని చెప్పవచ్చును. లేకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మరో ప్రాంతంలో తనకు తాను సమాధి కట్టుకోదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu