శంఖారావ సభకో నమస్కారం!

 

 

 

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో ఈరోజు నిర్వహిస్తున్న సమైక్య శంఖారావ సభ, దాని నిర్వహణ వెనుక అసలు ఉద్దేశాల సంగతేమోగానీ, హైదరాబాద్‌లో జనం మాత్రం శంఖారావ సభకో నమస్కారం అంటున్నారు. అసలే వర్షాలతో జనం అల్లాడిపోతుంటే ఈ సమయంలో ఈ సభలేంటని అటు తెలంగాణ వారితోపాటు సీమాంధ్రులు కూడా విసుక్కుంటున్నారు.

 

సమైక్య శంఖారావం సభని జరగనివ్వమని తెలంగాణవాదులు గట్టి పట్టుదలతో వున్నారు. దీనికితోడు సభకి అడ్డుపడితే నరికేస్తాం, చంపేస్తాం అంటూ వైసీపీ కార్యకర్తలు స్టేట్‌మెంట్లు ఇవ్వడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. దాంతో పోలీసులు తమ డేగకళ్ళకు పనిపెట్టారు. హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభ జరిగే ఎల్.బి.స్టేడియం చుట్టుపక్కల అయితే పరిస్థితి మరింత దారుణంగా వుంది.


అటువైపు వెళ్ళిన వాహనాలు పోలీసు ఆంక్షల ఫలితంగా ఎటు తిరిగి ఎటువైపు వెళ్ళి ఎటువైపు తేలతాయో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితులు వున్నాయి. మామూలు రోజుల్లోనే హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లు మామూలు విషయం. ఇక వర్షాలు పడే సమయంలో అయితే ఇకచెప్పనే అవసరం లేదు. అలాంటి పరిస్థతుల్లో ఇలాంటి ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ భారీ స్థాయిలో జామ్ అవుతోంది.



పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడి పరిస్థితి కంటే దారుణంగా ఎల్.బి. స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయిన నగర జీవి పరిస్థితి వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వాదుల నిరసన ప్రదర్శనలుంటాయన్న అనుమానాలతో పోలీసులు అందరినీ అనుమానపు చూపులు చూస్తున్నారు. నగరంలో ప్రత్యేక చెకింగ్‌లు, నాకాబందీలు జరుగుతున్నాయి. ఇలాంటి ఇబ్బందులకు కారణమైన వైసీపీ సమైక్య శంఖారావ సభ త్వరగా ముగిస్తే బావుండని నగరజీవి కోరుకుంటున్నాడు. సమైక్య శంఖారావ సభకో నమస్కారం పెడుతున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu