సల్మాన్ రెండు సార్లు "నిర్దోషి"

ఏదైనా నేరం చేయడమో..లేదంటే నేరాన్ని అభియోగించబడటం వల్లనో ఒక వ్యక్తి లోలోపల కుమిలిపోతాడు. నేనేప్పుడు బయట పడతానురా దేవుడా..! అంటూ మనసులో భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. తీరా అన్ని కలిసొచ్చి నిర్దోషిగా బయటపడ్డ ఆ వ్యక్తి ఆనందానికి అవధులుండవు. అలాంటిది ఒకసారి కాదూ ఏకంగా రెండు సార్లు నిర్దోషిగా తేలితే..అబ్బా ఆ వ్యక్తి ఎంతటి అదృష్టవంతుడో కదా..? ఆ మోస్ట్ లక్కీ పర్సన్ ఎవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆయన వేరోవరో కాదు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఆయన పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది మెలికలు తిరిగిన దేహం, హీరోయిన్లతో లవ్ ఎఫైర్లు, వెరైటీ సినిమాలు, వివాదాలతో పాటు హిట్ అండ్ రన్ కేసు, కృష్ణజింకల కేసులు గుర్తొస్తాయి. అయితే ఇక నుంచి చివర పేర్కొన్న రెండు పదాలు వినిపించవు..కనిపించవు.

 

2002 సెప్టెంబర్ 28 అర్థరాత్రి ఒక బార్‌లో పీకల్లోతుగా మద్యం సేవించి..తన వాహనంలో మితిమీరిన వేగంతో డ్రైవ్ చేస్తూ బాంద్రా శివార్లలో ఫుట్‌పాత్ పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపై దూసుకెళ్లి..ఒకరి మరణానికి, మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యేందుకు కారణమయ్యారన్న ఆరోపణలపై సల్లూభాయ్‌పై కేసు నమోదైంది. దీనిపై 13 ఏళ్ల సుధీర్ఘ విచారణతో పాటు అనేక మంది సాక్షులను ప్రశ్నించిన మీదట ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్‌ఖాన్‌ను దోషిగా పరిగణించి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ వార్త బాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం సల్మాన్‌కు వ్యతిరేకంగా ఆధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని అభిప్రాయపడుతూ కేసును కొట్టివేసింది. అలా ఆయన మొదటిసారి నిర్దోషిగా బయటపడ్డాడు.

 

ఇక రెండో సంఘటన..హిట్ అండ్ రన్‌ కంటే పాత కథ, కృష్ణజింకల కేసు. 1998 సంవత్సరంలో "హమ్ సాథ్ సాథ్ హై" సినిమా షూటింగ్ కోసం సల్మాన్‌ఖాన్, సోనాలి బింద్రె, టబు, నీలమ్ తదితరులు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ వెళ్లారు. ఇంకేముంది అప్పట్లో మనోడిది ఉడుకు రక్తం..పైగా హీరోయిన్లతో లవ్ ఎఫైర్లతో మునిగి ఉండటంతో షూటింగ్ కోసం వచ్చిన హీరోయిన్ల ముందు హీరోయిజం ప్రదర్శించాలనుకున్నాడు. అంతే గన్ను చేతపట్టి, కృష్ణజింకలను వేటాడి.. వాటి మాంసాన్ని ఆరగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వన్యప్ర్రాణుల్ని వేటాటడం, అక్రమ ఆయుధాల్ని ఉపయోగించడం ఇలా రెండు కేసులు ఆయనపై నమోదయ్యాయి.

 

ఈ రెండు కేసుల్లో సల్మాన్‌ దోషిగా తేలడంతో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది జోథ్‌పూర్ న్యాయస్థానం. సేమ్ హిట్ అండ్ రన్ కేసులో కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టుకు వెళ్లినట్లే..ఇక్కడ కూడా రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లాడు సల్మాన్. మళ్లీ సల్మాన్‌ను దోషిగా తేల్చే సాక్ష్యాధారాల్ని సేకరించడంలో విఫలమయ్యారన్న కారణంతో, రాజస్థాన్ హైకోర్టు కండలవీరుడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. న్యాయ, అన్యాయాలు కాలాన్ని బట్టి మారిపోతున్న కాలంలో..సాక్ష్యాధారాలను బట్టి ఒకనాడు తప్పు అని తేలింది కూడా..మరి కొన్నాళ్లకు ఒప్పుగా నిగ్గు తేలుతున్నది. కోర్టు తీర్పుల్లో దోషిగా తేలడం, పై కోర్టులో బెయిల్ పొందడం, ఆ తర్వాత నిర్దోషిగా నిలవడం..ఇలాంటి వారిలో సల్మాన్‌ మొదటి వారూ కాదు, చివరి వారు కూడా కాదేమో.