Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్లాస్టిక్ వాడితే కూలకుండా ఉంటుందా..?
posted on: Jul 26, 2016 4:34PM

హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వద్ద ఆదివారం నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో ఇద్దరు మరణించగా..10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద కారణాలు అన్వేషించేందుకు జేఎన్‌టీయూ నిపుణుల బృందం ఘటనా స్థలిని సందర్శించింది. ఈ పరిశీలనలో చేదు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాణానికి అనుమతుల నుంచి నిర్మాణ పనుల వరకు ప్రతి దానిలో అక్రమాలు బయటపడ్డాయి. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌కి 1996లో మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి 6,188 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జి+2 భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. దానిని ఉల్లంఘిస్తూ ఏకంగా గ్రౌండ్ ప్లస్ 3 అంతస్థుల భవనం నిర్మించారు.

అయినా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోలేదు. 2014లో మరో భవంతి నిర్మాణానికి ఎన్ఎఫ్‌సీసీ సన్నాహాలు చేస్తుండగా ఈ సారి నిద్రలేచిన అధికారులు అదే ఏడాది జూన్ 12న తొలి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయినా ఎన్ఎఫ్‌సీసీ "పెద్దలు" లైట్ తీసుకోవడంతో అక్టోబర్ 8న తుది నోటీసు ఇచ్చారు. అయినా మన పెద్దల ముందు అధికారుల నోటీసులు ఏపాటి..? వెంటనే కోర్టును ఆశ్రయించి నిర్మాణ విషయంలో జీహెచ్ఎంసీ జోక్యం చేసుకోకుండా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుని దర్జాగా తమ పని కానిచ్చారు. దీనిపై జీహెచ్ఎంసీ కౌంటర్ దాఖలు చేసినా..స్టే వెనక్కురాకపోవడంతో పనులన్నీ నిరాటంకంగా సాగాయి. ఇక కాంట్రాక్టర్ సంగతి చూస్తే "రాత్రికి రాత్రే మిద్దెలు" కట్టాలన్న దురాశ కళ్లకు కట్టినట్టు కనిపించింది. నాసిరకం సిమెంట్, నాణ్యత లేని ఇనుప సామాగ్రిని నిర్మాణంలో ఉపయోగించాడు .

ఎక్కడైనా పిల్లర్ కట్టాలంటే మధ్యలో ఐరన్ రాడ్లు పెట్టి వాటిని కాంక్రీట్‌తో కవర్ చేస్తారు. కానీ ఇక్కడ ఐరన్ రాడ్లకు బదులు ప్లాస్టిక్ పైప్‌లు వేసి దానిని సిమెంట్‌తో పూత పూశారు. కింద ఎలాంటి సపోర్ట్ లేకుండా పొర్టికో నిర్మాణం మొదలుపెట్టడంతో శ్లాబ్ వేస్తున్న కొద్దీ భారం పెరగడంతో పోర్టికో కుప్పకూలింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే పనులన్ని రాత్రి పూట కొనసాగడం..ఫలితంగా అధికారుల పర్యవేక్షణ కొరవడి ఘోర ప్రమాదానికి కారణమైంది. ఒకవేళ అధికారులకు సమాచారం అందినా "పెద్దల" జోక్యం ఉండటంతో మనకెందుకులే అన్నట్లు వదిలివేయడంతో అక్రమ నిర్మాణాలు యథేచ్చగా కొనసాగాయి. ఏదైనా జరిగితే కానీ మొద్దు నిద్ర వీడని ప్రభుత్వం ఎప్పటిలాగే అక్రమ భవన నిర్మాణాలను అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి శేఖర్ రెడ్డి, సెక్షన్ అధికారి మల్లేశ్వర్‌లను సస్పెండ్ చేసింది. నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మొత్తానికి ప్రముఖులు, జీహెచ్ఎంసీ అధికారులు కుమ్మక్కై చేసిన పని రెండు కుటుంబాలను రోడ్డున పడేసింది.



.jpg)


