థర్డ్ వేవ్ వచ్చిందంటే ఆగదు.. హైకోర్టు వార్నింగ్‌...

కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం చాలా వరకు కోలుకుంది. కేరళ, మహారాష్ట్ర మినహా మిగిలిన రాష్ట్రాలలో కొత్త కేసుల సంఖ్య తగ్గడంతో పాటుగా, మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. అయితే, ఇంతటితో కరోనా చచ్చినట్లే అనుకుంటే పొరపాటే అవుతుంది. చైనా సహా అనేక దేశాల్లో కరోనా కేసులు సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతోంది. చైనాలో అయితే, మళ్ళీ లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి తలెత్తింది. అమెరికాలోనూ అదే పరిస్థితి. కాబట్టి, కరోనా మహమ్మారి విషంలో అప్రమత్తంగా ఉండక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇదలా ఉంటే, కరోనా వైరస్‌ మూడోసారి విజృంభించడం ప్రారంభమైతే వేగంగా చుట్టేస్తుందని తెలంగాణ హైకోర్టు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. కొవిడ్‌ మూడోవేవ్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని సూచించింది. సమస్యలను ఊహించడం, ప్రణాళికలు రచించడం, వాటిని అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత. అది కోర్టుల పని కాదు. వ్యవస్థలు సరిగా వ్యవహరించకపోతే కోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని న్యాయస్థానం  వ్యాఖ్యానించింది. 

కొవిడ్‌ 19 వ్యాప్తి, పరీక్షలు, వైద్య సౌకర్యాలు వంటి అంశాలపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు గతంలో ఆదేశించిన విధంగా విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సమావేశం వివరాలను అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనానికి సమర్పించారు. నిపుణుల కమిటీ నిర్ణయాలను ఏ మేరకు అమలు చేస్తున్నారు? అందుకు సంబంధించిన కలర్‌ గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ను ఎక్కడ? అని ధర్మాసనం ఏజీని, విచారణకు హాజరైన పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావును ప్రశ్నించింది. మూడో వేవ్‌పై చీఫ్‌ సెక్రటరీ పర్యవేక్షిస్తున్నారని.. ఇటీవల సమావేశాలు సైతం నిర్వహించారని శ్రీనివాసరావు తెలిపారు. కలర్‌ గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ను సమర్పించేందుకు కొంత గడువు ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ చికిత్సలో ఉపయోగించే ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చారా? అన్న అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రం తరఫున హాజరైన అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌రావును హైకోర్టు ప్రశ్నించింది. వివరాలు అందించేందుకు సమయం ఇవ్వాలని కోరారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu