సైదాబాద్ శాడిస్ట్ చచ్చాడు.. రైల్వే ట్రాక్‌పై సూసైడ్...
posted on Sep 16, 2021 11:02AM
ఉన్మాది చచ్చాడు. ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగాడు ప్రాణం విడిచాడు. ఐదు రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన రాజు.. రైల్వే ట్రాక్ దగ్గర విగతజీవుడై పడున్నాడు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. నగర శివారు ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్ దగ్గర రాజు డెడ్‌బాడీని గుర్తించారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతుడు రాజు అని నిర్థారించారు.
రాజు మరణంతో ఐదు రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఘటన జరిగినప్పటి నుంచీ పోలీసులు రాజు కోసం విస్తృతంగా గాలించినా దొరకలేదు. వెయ్యి మంది పోలీసులతో ప్రత్యేక బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేసినా నిందితుడు చిక్కలేదు. రాజుపై ఏకంగా 10 లక్షల ప్రైజ్‌మనీని కూడా ప్రకటించారు. రాజు ఫోటోలతో పోలీసులు బస్టాండ్లు, హైవేలు గాలించారు. ఆవేవీ ఫలితాలు ఇవ్వలేదు. ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్ దగ్గర రాజు ఆత్మహత్య చేసుకున్నాడని తేల్చారు.
మరోవైపు, ఘటన జరిగినప్పటి నుంచీ చిన్నారి కుటుంబానికి వివిధ రాజకీయ వర్గాల నుంచి సానుభూతి వ్యక్తమైంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల.. తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం, పోలీసుల తీరును తప్పుబట్టారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌పైనా రచ్చ జరిగింది. దీంతో, పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. మరింత ఛాలెంజ్‌గా తీసుకున్న హైదరాబాద్ కాప్స్.. పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రాజు సెల్‌ఫోన్ వాడకపోవడంతో అతన్ని పట్టుకోవడం కష్టతరంగా మారింది.
పోలీసులు, ప్రజలు అంతా రాజు కోసం వెతుకుతున్న విషయం తెలుసుకొని కాబోలు.. నిందితుడు రాజు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, హైదరాబాద్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్‌ఘణపూర్ దగ్గర సూసైడ్ చేసుకోవడం పోలీసుల వైఫల్యమే. వాడు సూసైడ్ చేసుకోకముందే.. పోలీసులు పట్టుకొని శిక్షించి ఉంటే బాగుండేదని అంటున్నారు.