సద్దాం హుస్సేన్ సమాధి ధ్వంసం

 

పాపం సద్దాం హుస్సేన్ని సమాధిలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇరాక్ దేశం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో అట్టుడికిపోతోంది. ఈ పోరులో 2006లో ఉరితీతకు గురైన సద్దాం హుస్సేన్ సమాధి ధ్వంసం అయింది. ఉరితీత తరువాత సద్దాంహుస్సేన్ పార్ధీవ దేహాన్ని ఆయన సొంత గ్రామం టిక్రిట్ నగరానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న అల్ ఔజా గ్రామంలో సమాధి చేశారు. తరువాత దానిని ఓ అద్భుత కట్టడంలా తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు ఈ సమాధి ఐఎస్ ఆక్రమిత టిక్రిట్ నగరంపై పట్టు సాధించేందుకు సైన్య జరిపిన బాంబు దాడుల్లో ధ్వంసమైంది. 48 గంటల్లో టిక్రిట్ పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్నీ స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో నగరం రెండువైపుల నుంచి ఆదివారం ఇరాకీ సైన్యం చేసిన దాడులవల్లే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసిన వీడియో ఫుటేజిలో ఔజా గ్రామంలోని సద్దాం సమాధి పిల్లర్లు నేలకూలిన దృశ్యాలు పొందుపర్చారు. ఇరాక్ సైన్యం మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చింది. అయితే ఇలాంటి ఉపద్రవాన్ని ముందే ఊహించి టిక్రిట్లోని సమాధి నుంచి సద్దాం దేహాన్ని వేరొక ప్రాంతానికి తరలించినట్లు సద్దాంహుస్సేన్అనుచరులు పేర్కొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu