రుణ మాఫీ ఓ ఎన్నికల స్టంట్
posted on Aug 4, 2023 3:11PM
వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రుణ మాఫీ చేయడం సహజమే. సాధారణంగా ఎన్నికల ముందు రుణ మాఫీలు జరుగుతుంటాయి. రైతులు బ్యాంకుల నుంచి తెచ్చుకున్న అప్పులను ఆయా ప్రభుత్వాలు తీర్చడమే రుణ మాఫీ అంటారు. వారు తమ పంటలను అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతారు. కొన్ని సమయాల్లో వాతావరణ పరిస్థితులు మరియు వనరుల లభ్యత కారణంగా , పంటలు విఫలం కావచ్చు మరియు రైతులు తాము తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగిన ఆదాయాన్ని పొందలేరు. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు విధిగా రుణ మాఫీ చేయాలి. తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.6385 కోట్లు ప్రతిపాదించింది. ఈమేరకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటన చేశారు.వ్యవసాయానికి జవజీవాలనందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రైతుల కళ్లలో దీనత్వం తొలిగి.. ధీరత్వం తొణికిసలాడుతోందని అప్పట్లో ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్బావానికి ముందు పదేళ్ల ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 7,994 కోట్లు ఖర్చు చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది జనవరి మాసానికి లక్షా 91వేల 612 కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఖర్చు చేసినట్టు గణాంకాలు తెలియ జేస్తున్నాయి.
ఒక్క రైతు బంధు పథకానికే 15,075 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. రైతు బీమాకు 15 వేల 98 కోట్లు ఖర్చు బడ్జెట్ లో కేటాయింపులు చేసినప్పటికీ రైతులకు ఎటువంటి బీమా ప్రయోజనాలు అందడం లేదని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. 90 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణ మాఫీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో 6385 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు రైతులకు రుణ మాఫీ జరగలేదు. రైతులు అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వానికి రుణ మాఫీ కోసం అర్జీపెట్టుకున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం రైతు మొరను ఆలకించలేదు. అయితే ఎన్నికల స్టంట్ లో భాగంగా రైతు రుణ మాఫీ ని ముఖ్యమంత్రి కెసిఆర్ పునరుద్దరించారు.
రైతు బంధు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో రుణమాఫీకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోబోతుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. నూతన సంవత్సరం మొదటి నెలలోనే రుణమాఫీని కూడా క్లియర్ చేసేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు ఈ వార్తలు వెలువడ్డాయి. కొత్త సంవత్సరం వచ్చి ఏడు నెలలు పూర్తి కావస్తున్నా ముఖ్యమంత్రి నోటి నుంచి రుణ మాఫీ ప్రకటన వెలువడ లేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రైతుల విషయంలో స్పష్టంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టే ఈ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి.
రైతులకు 10వ దఫా రైతు బంధును ప్రారంభించిన ప్రభుత్వం రుణమాఫీని కూడా క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న లక్ష రూపాయల వరకు రుణ మాఫీని గురువారం నుంచే అమలు చేస్తున్నారు.