అధికార అహంతో ముందుకెళ్లే జనం వాతలు పెడతారు.. కోటంరెడ్డి

అధికారం తలకెక్కితే ఏం జరుగుతుందో మూడేళ్ల తరువాత ఆ వైసీపీ ఎమ్మెల్యేకు అర్థమైంది. తనకొక్కడికే అర్ధమైతే చాలదనుకున్నారో ఏమో సొంత పార్టీ నేతలకే ఆయన కొంచం జాగ్రత్తగా ఉండండంటూ హెచ్చరిక లాంటి సూచన చేశారు. తన మాటలు పట్టించుకోకుంటే ముందు ముందు కష్టాలు తప్పవనీ పేర్కొన్నారు.

ఇంతకీ ఆయన ఎవరంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు వైసీపీ నేతలనూ, కార్యకర్తలనే కాదు, విపక్షాలను, చివరికి పరిశీలకులనూ కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. జనం మాత్రం గడపగడపకూ మన ప్రభుత్వంలో తగిలిన నిరసన సెగలతో ఆయనకు దిమ్మతిరిగి బొమ్మ కనపడి ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఏపీలో ఇప్పుడు రాజకీయ హీట్ పీక్స్ లో ఉంది. అధికార విపక్షాల మధ్య  రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉండే విమర్శల స్థాయి ఎప్పుడో దాటి పోయింది. అధికారంలో ఉన్న ధీమాతో వైసీపీ తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దాడులు సాగిస్తోంది. టీడీపీ నేతల ఇళ్లను కూల్చివేయడానికి సైతం సిద్ధపడుతోంది. ఇటీవలి కాలం వరకూ వైసీపీ ఆగడాలను మౌనంగా భరించిన టీడీపీ.. ఒంగోలులో మహానాడు విజయవంతం అయిన తరువాత నుంచి అధికార పార్టీతో సై అంటే సై అంటూ నిలబడుతోంది. అధికార పార్టీ నేతలు విపక్ష నేతలను వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరులో శుక్రవారం జరిగిన వైసీపీ నెల్లూరు రూరల్ ప్లీనరీ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారియి.

సోంత పార్టీ నేతలనే షాక్ కు గురి చేశాయి. వేదికపై ఉన్న మంత్రి కాకాని సమక్షంలోనే కోటం రెడ్డి విపక్షాలను రాజకీయ ప్రత్యర్థులుగానే చూడాలి తప్ప శత్రువులుగా కాదని కుండబద్దలు కొట్టినట్లు చేశారు. అధికార ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే జనం పెట్టాల్సిన చోట వాత పెడతారని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష నాయకలు, కార్యకర్తలపై ఎట్టి పరిస్థితుల్లోనూ వేధింపులకు పాల్పడవద్దనీ, ఇబ్బందులు పెట్టవద్దనీ వైసీపీ నేతలకు ఆయన హెచ్చరిక లాంటి సూచన చేశారు.  అధికార పార్టీ నేతలు, కార్యకర్తలూ అందరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు.