తాత‌ గారికి అమ్మ‌మ్మ భ‌ర‌ణం!

వాళ్లిద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. వారి ఇద్ద‌రి కుమార్తెల‌కూ పెళ్లిళ్ల‌యి పిల్ల‌ల‌తో మ‌రో చోట‌ హాయిగానే వున్నారు. పెద్దాయ‌న‌కి 83, ఆమెకి 78 ఏళ్లు. ఆయ‌న‌కు షుగ‌ర్‌, గుండె సంబంధిత స‌మ‌స్య‌. ఆమెకు షుగ‌రు. వీరిద్ద‌రికీ 1964లో పెళ్ల‌యింది. వీరిది పుణే. ఆయ‌న  ఒక  విద్యా సంస్థను న‌డుపుతుండేవాడు. ఆ సంస్థ‌కు డైరెక్ట‌ర్‌గా ఆయ‌న భార్య వుండేది. చాలా కాలం ఎంతో చ‌క్క‌గా న‌లుగురికి ఆద‌ర్శ ప్రాయంగానూ జీవించారు.

ఇద్ద‌రూ వృద్ధుల‌యిన త‌ర్వాత‌నే అస‌లు గొడ‌వంతా వ‌చ్చి ప‌డింది. వీరి మ‌ధ్య‌ హ‌ఠాత్తుగా చిన్న‌పాటి గొడ‌వ‌లు వ‌చ్చి అవి చిలికి చిలికి గాలివానగా మారి ఏకంగా కోర్టు దాకా వెళ్లారు. త‌న‌ను ఆమె బొత్తిగా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, త‌నను బాగా చూసుకోవ‌డం లేద‌ని  ఆ పెద్దాయ‌న కంప్ల‌యింట్‌. త‌న‌ను తెగ వేధిస్తోంద‌ని కోర్టువారిని ఆశ్ర‌యించాడు. వ‌య‌సులో బాగా పెద్ద‌వాడ‌యిన భ‌ర్త‌ను ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన ఆమె చాలా నిర్ల‌క్ష్యంగా చూస్తోందిట‌. ఏకంగా ఆయ‌న్ను ఆ వ‌య‌సులో ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్ల‌గొ్ట్టాల‌ని తెగ ప్ర‌య‌త్నించింది. ఇలా గొడ‌వ‌లు పెరిగి 2019లో ఇద్ద‌రూ విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఆ ద‌ర‌ఖాస్తు వివ‌రాలు తెలుసుకుని జ‌డ్జి తెగ న‌వ్వుకున్నారు. అస‌లు సంగ‌తి క‌నుక్కుం దామ‌నుకుని ఆయ‌నే స్వ‌యంగా ఈ పెద్ద‌వాళ్లున్న ఇంటికి వెళ్లారు. పూర్వాప‌రాలు తెలుసుకున్నారు. వీళ్లు క‌లిసి వుండే అవ‌కాశాలు త‌క్కువేన‌ని గ్ర‌హించారు. 

కానీ ఇంత పెద్ద వ‌య‌సులో ఆమెకి త‌న భ‌ర్త‌ను హింసించాల‌ని ఎలా అనిపించిందో న్యాయ మూర్తిగారికీ బోధ‌ప‌డ‌లేదు. చాలాకాలం ఎంతో అన్యోన్యంగా వున్న ఈ దంప‌తులు ఇప్పుడు అదీ కృష్ణా.. రామా అనుకుంటూ కాలం వెళ్ల‌దీయాల్సిన స‌మ‌యంలో విడాకులు అడ‌గ‌డ‌మేమిటో ఎవ్వ‌రికీ అర్ధంకాలేదు, పైగా న‌వ్వుకుంటున్నారు. మొత్తానికి ఈ కేసు పూర్వాప‌రాల మీద చ‌ర్చించిన మీద‌ట న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పే ఇచ్చింది. అదేమ‌య్యా అంటే.. భ‌ర్త‌కు ప్ర‌తినెలా రూ.25 వేలు భరణం ఇవ్వాలంటూ తీర్పు నిచ్చింది. భ‌ర్త‌కు భార్య ఇంత పెద్ద మొత్తంలో భ‌ర‌ణం ఇవ్వాల‌ని ఆదేశించ‌డం రాష్ట్రంలో ఇదే మొద‌టి కేసు అని న్యాయ‌వాది అన్నారు. 

 తీర్పుకి ముందు ఆ పెద్దాయ‌న అభిప్రాయాన్ని అడిగితే .. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేని సమయంలో తాను బాగా చూసుకున్నానని, ఆరోగ్యం నయమయ్యాక తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అస‌లు ఇలాంటి కేసు రాష్ట్రంలోనే మొద‌టిది అని మరాఠీలు అనుకుంటున్నారు.  భార్య సంపా దిస్తూ.. అదే క్రమంలో భర్తకు ఆదాయ వనరు లేకపోతే, గొడవలు జరిగిన క్రమంలో భర్త కూడా హిందూ వివాహ చట్టం ప్రకారం భరణం కోసం దావా వేయవచ్చని బ‌హుశా ఇప్పుడు అంద‌రికీ తెలుస్తుందేమో!