విజయమ్మతో రోజా బేటీ.. మతలబు ఏమిటి?

మంత్రి ఆర్కే రోజా సినీమాల నుంచి రాజకీయాలలోకి వచ్చారు. ఇప్పుడు రాజకీయ వేదికలపై సినిమా చూపిస్తున్నారు. ఏపీ మంత్రులందరిలోనూ రోజా  స్పెషల్. ఆమె ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ వంటి వారు. ఎవరి మాటా వినరు. ఆమెకు ఏం అనిపిస్తే అది మాట్లాడేస్తారు. ఏం అనిపిస్తే అది చేసేస్తారు.   రోజా  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మితో హైదరాబాద్ లో భేటీ అయ్యారు.  ఇటీవల వైసీపీలో జరిగిన పరిణామాలతో ఎవరూ విజయమ్మతో భేటీకి ఆసక్తి చూపించడం లేదు. కొత్త మంత్రులెవరూ కనీసం ఆమె పేరు  కూడా తల్చుకోలేదు. కొఅసలు విజయమ్మ వైసీపీ   గౌరవాధ్యక్షురాలు అని దాదాపు అందరూ మరచిపోయారు. కానీ రోజా మాత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకుని మరీ హైదరాబాద్ వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఇదే విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉన్న షర్మిల నివాసంలో రోజా విజయమ్మతో భేటీ అయ్యారు.  తనకు మంత్రి పదవి లభించిన సందర్భంగా విజయమ్మ ఆశీస్సులు తీసుకోవాలని కొంత కాలంగా రోజా ప్రయత్నిస్తున్నారని ఇప్పటికి కుదిరిందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆ వర్గాలు అంటున్నప్పటికీ, జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలను దూరంగా పెడుతున్న నేపథ్యంలో రోజా ప్రత్యేకంగా విజయమ్మతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు రెండు గంటల పాటు విజయమ్మతో భేటీ అయిన రోజా  తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు తెలంగాణలో షర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందన పైనా చర్చించినట్లు చెబుతున్నారు.  ఇక అంతకు ముందు కూడా రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలో కేటీఆర్ ఏపీలో సౌకర్యాలపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గు మంటున్నారు. రోజా  కేసీఆర్ ను కలవడానికి ఆ టైంను ఎన్నుకోవడంపైనా పార్టీలో ఒకింత అసంతృప్తి వ్యక్తమైంది. ఇప్పుడు పార్టీ అధినేతకు కనీస సమాచారం ఇవ్వకుండా విజయమ్మతో భేటీ అయ్యారు. ఇంతకీ రోజా విజయమ్మతో భేటీ కావడం వెనుక ఉన్న వ్యూహమేమిటి? జగన్ అంగీకారంతోనే ఆమె విజయమ్మను కలిసి ఉంటారనీ ఒక వాదన వినిపిస్తున్నది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu