సత్తెనపల్లిలో సింగయ్యని తొక్కించింది జగన్ కారే
posted on Jun 22, 2025 12:02PM

మాజీ సీఎం జగన్ ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటనలో రోడ్డు సింగయ్య అనే వ్యక్తి మృతి షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సింగయ్య తొలుత జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని మృతి చెందాడని భావించారు. అయితే, జగన్ కారే స్వయంగా సింగయ్య మెడపై నుంచి వెళ్లిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింగయ్యను ఢీకొట్టింది సాక్షాత్తూ జగన్ ప్రయాణించిన వాహనమేనని న్యూస్ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ క్రమంలో పోలీసులకు కీలకమైన వీడియో ఆధారం లభించింది. జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద ఓ వ్యక్తి పడి నలిగిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వీడియోలో జగన్ కారు పైనుంచి వైసీపీ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, అదే సమయంలో ఓ కార్యకర్త (సింగయ్య) కారు టైర్ల కింద పడి నలిగిపోవడం స్పష్టంగా రికార్డయింది. మరో వీడియోలో, కారు కింద వృద్ధుడు పడినట్టు స్థానికులు కేకలు వేస్తున్నా, వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చినట్టు కనిపించింది. జగన్ కాన్వాయ్ వాహనం కాకుండా వేరే వాహనం తగిలి ప్రమాదంలో సింగయ్య చనిపోయాడు గతంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య మృతికి కారణమైన వారిపై, ముఖ్యంగా జగన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి దారుణ ఘటన జరిగినా, తన కాన్వాయ్ కారణంగా సొంత పార్టీ కార్యకర్త మరణిస్తే కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంపై జగన్ తీరును పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.