పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పురోగతి
posted on Jun 22, 2025 12:31PM
.webp)
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ పురోగతి సాధించింది. టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పర్వీజ్ అహ్మద్, బషీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హిల్ పార్క్‌కు చెందిన బషీర్ అహ్మద్ ఉగ్రవాదులకు సాయం చేశారని ఎన్ఐఏ తెలిపింది. ఈ ఘటనలో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు పాక్ ఉగ్రవాదుల హస్తమున్నట్లు ధ్రువీకరించింది.
అరెస్టు చేసిన ఇద్దరు నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్ 19 (ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించినందుకు శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.ఏప్రిల్ 22న పహల్గాంలోని ప్రముఖ ప్రాంతమైన బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.