200 అప్పు తీర్చడానికి ఇండియా వచ్చిన విదేశీ మంత్రి !

 

 

 

ఈరోజుల్లో అప్పు ఎగ్గొట్టడం చాలా సాధారణ విషయం. అందునా మాల్యా, మోడీలాంటి ఆర్ధిక నేరస్తులు  దేశాలు దాటి పోతున్నా ఏమీ చేయలేని దేశం మనది. అలాంటిది ఒక రెండు వందల రూపాయల అప్పు, అది కూడా ఇరవై ఏళ్ల క్రితం చేసిన అప్పు తీర్చడం కోసం విదేశాల నుండి ఇండియా వస్తే ఏమంటారు ? మీరు మాత్రం పిచ్చోడనుకోవచ్చు కానీ ఆయన ఒక విదేశాంగ మంత్రి. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ విషయం ఏంటంటే, తాను 20 ఏళ్ల కిందట కట్టాల్సిన రూ.200 చెల్లించడానికి కెన్యా విదేశాంగ శాఖ మంత్రి భారత్‌కు విచ్చేశాడు. 

ఆఫ్రికా ఖండంలోని కెన్యా నుంచి సుమారు వేల కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్రలోని ఔరాంగాబాద్‌‌ వచ్చారు మంత్రి రిచర్డ్‌ టోంగ్డీ. ఆయన 20 ఏళ్ల కిందట ఔరంగాబాద్‌ లోని మౌలానా కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో వఖేహడేనగర్‌ ప్రాంతంలో అద్దెకు ఉండే వారు. అక్కడ స్థానిక కిరాణా వ్యాపారి గవాలీ దుకాణం నుంచి నిత్యావసర సరుకులు తీసుకునేవారట. అలా ఆయనకు రూ.200 బాకీ పడ్డారు. అయితే అనుకోని పరిస్థుతులలో ఆ డబ్బులు ఇవ్వకుండానే రిచర్డ్‌ స్వదేశానికి వెళ్లిపోయారు. అక్కడికి వెళ్ళాక ఉద్యోగం చేసి ఆ తర్వాత ప్రజాప్రతినిధిగా ఎన్నికై ప్రస్తుతం కెన్యా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయ్యారు. 

అయితే, తాను గవాలీ కుటుంబానికి రూ.200 బాకీ ఉన్న విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్న ఆయన తన భార్యతో సహా మంగళవారం ఔరంగాబాద్‌ వచ్చి గవాలీ కుటుంబాన్ని కలిశారు. గవాలీ మారుడు కాశీనాథ్‌ గవాలీకి తాను బాకీపడ్డ రూ.200 ఇవ్వబోగా భావోద్వేగానికి గురైన కాశీనాథ్‌ రూ.200 తీసుకోడానికి నిరాకరించారు. రిచర్డ్‌కు ఆతిథ్యమిచ్చి విందు ఏర్పాటుచేశారు. నిజంగా ఆయనను మెచ్చుకోవాల్సిన విషయమే మరి.