కాళ్ళు మొక్కబోయిన మంత్రి ఇంద్రకరణ్.. హరీష్ రావు ఫైర్
posted on Jul 10, 2019 11:47AM
కొన్ని మీడియా సంస్థలు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మంత్రి ఇంద్రకరణ్, హరీష్ కాళ్ళు మొక్కబోయారంటూ వార్తలు రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు ఎలా రాస్తారంటూ సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తపడాలంటూ హెచ్చరించారు.
తాజాగా బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు హరీష్ రావు పాల్గొన్నారు. అమ్మవారి కల్యాణం జరుగుతున్న సందర్భంలో ముగ్గరూ పక్కపక్కనే కూర్చున్నారు. కల్యాణం అనంతరం మంత్రి ఇంద్రకరణ్ లేవడానికి ప్రయత్నిస్తుండగా.. హరీష్ ఆయనకు సహకరించారు. అయితే ఈ సమయంలో ఓ ఫొటోగ్రాఫర్ కెమెరా లో ఫోటో తీసాడు. ఓ మీడియా సంస్థ నిజనిర్ధారణ చేసుకోకుండా.. ఆ ఫొటో ఆధారంగా హరీష్ కాళ్లను ఇంద్రకరణ్ రెడ్డి మొక్కబోయారంటూ వార్తను ప్రచురించింది. ఇది హరీష్ దృష్టికి రావడంతో ఆయన ఘాటుగా స్పందించారు. ఇది పూర్తిగా అవాస్తవమని ట్వీట్ చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తుండగా సాయపడ్డానని.. దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రచురించారని తెలిపారు. ఈ వార్తను తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇలాంటి వార్తను ప్రచురించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వార్తలు ప్రచురించే ముందు నిర్ధారణ చేసుకుని ప్రచురించాలని హరీష్ కోరారు.