కేసీఆర్, జగన్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్.. తెలుగు రాష్ట్రాల్లో రచ్చ

ఆంధ్రాలోనూ టీఆర్ఎస్ ను విస్తరించాలని తనకు వినతులు వస్తున్నాయంటూ ప్లీనరీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ మాటలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటరిచ్చారు. అయితే టీఆర్ఎస్, ఏపీ మంత్రులు చేస్తున్న కామెంట్లపై తీవ్రంగా స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని అన్నారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్నినాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్ర కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వందల మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్‌ అని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు.  రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే ఏపీలో కేసీఆర్ భేషుగ్గా పోటీ చేయొచ్చని నాని పేర్కొన్నారు.