ఉరిగా మారుతున్న వరిసాగు..హుజూరాబాద్ లో కారుకు కంగారు

హుజూరాబాద్ ఉపఎన్నికల తరుణంలో సాగు చేయాల్సిన  పంటల  విషయంపై  క్లారిటీ లేకపోవడం తెలంగాణ సర్కారుకు తలనొప్పిగా మారింది. యాసంగి సీజన్ వచ్చినా రైతులకు ఏ పంటలు వేయాలో చెప్పడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. దీంతో గతేడాది ఇచ్చిన హామీకి సైతం దిక్కు లేకుండా పోయింది. సాగునీటి పారుదలపైనే దృష్టి సారించిన కేసీఆర్.. మిషన్ భగీరథ పేరుతో భారీ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. దీంతో తెలంగాణ అంతటా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.

సాగునీటి పారుదల విషయంలో ఇది పాజిటివ్ అంశమైతే... వరిసాగును నియంత్రించాల్సి రావడం నెగెటివ్ అంశంగా మారుతోంది. వరిసాగు గతంలో కంటే రెట్టింపుకన్నా ఎక్కువ కావడంతో దిగుబడి గణనీయంగా పెరిగింది. అయితే ఎఫ్.సి.ఐ ద్వారా కేంద్రం కొనుగోలు చేసే సామర్థ్యం కన్నా దిగుబడి ఎక్కువవడంతో ఇప్పుడు కంట్రోల్ చేయాాల్సి వస్తోంది. ఈ విషయాన్ని పట్టించుకోని కేసీఆర్... తెలంగాణలో వరిసాగును విపరీతంగా ప్రోత్సహించారు. పైగా సన్న రకాల వరినే వేసుకోవాలని, దాంతో ఎక్కువ ఆదాయం వస్తుందని సూచించారు. రైతులు కూడా కేసీఆర్ సూచనలు ఫాలో అవడంతో దిగుబడి అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేయడం అసాధ్యంగా మారింది.

ఈ పరిస్థితి గత యాసంగిలోనే ఏర్పడడంతో అప్పుడు రైతులు రోడ్డెక్కారు. వరి కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని, తాము ఆరుగాలం పండించిన పంటను ఎవరికి, ఎక్కడ అమ్మాలో తెలియకపోతే తీవ్రంగా నష్టపోతామని, ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారంటూ నిలదీశారు. అటు కేంద్రమూ కొనక, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే వరి  రైతుల పరిస్థితేంటని రైతుసంఘాలు ఆందోళన చేశాయి. అయితే వరి పంటను కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితి లేదని గ్రహించిన కేసీఆర్.. వరి వేస్తే ఉరే శరణ్యమంటూ కొత్త స్లోగన్ క్రియేట్ చేశారు. రైతులకు రానున్న ప్రమాద ఘంటిికలు మోగించారు. 

ఒకసారి వరి వేయాలని, మరోసారి వద్దని చెప్పిన ముఖ్యమంత్రి.. తాజా పరిస్థితికి పరిష్కారమేంటో చూపలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతోంది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో యాసంగి పంటపై  ఇప్పటికీ  రైతులకు స్పష్టతనివ్వకపోవడం ప్రభుత్వ ముందుచూపు లేకపోవడమే గాక అధికారుల వైఫల్యంగా మారుతోంది. సీఎం కేసీఆర్ అవగాహన లేకుండా ఇచ్చే హామీలు తమకు తీవ్రమైన తలనొప్పులు తెస్తున్నాయని అధికారులు వాపోతున్నారు. 

కేసీఆర్ కేబినెట్ లోని ఓ మంత్రి వరి వేయాలని ఇప్పుడు కూడా సూచిస్తుండగా క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన కలిగిన కలెక్టర్లు మాత్రం వరి వేయరాదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వరిని ప్రోత్సాహిస్తున్న కారణంగా వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడపల్లిలో రైతులంతా వరినే వేశారు. అయితే జూరాల కాలువకు ఆ గ్రామం చివరలో ఉన్న కారణంగా అక్కడి రైతులకు నీరందటం లేదు. దీంతో తమ పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన రైతులు నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు. తమకు నీళ్లిచ్చేదాకా వారిని కదలనిచ్చేది లేదని భీష్మించుకున్నారు. తమ పరిధిలో తాము నీరిచ్చినా జూరాల నుంచి 75 కి.మీ. ఉన్న దగడపల్లి వరకు నీళ్లు రావని, అదీగాక పైనున్న రైతులు మోటార్లు కూడా పెడుతూ నీటిని తోడేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తామేం చేయాలంటూ చేతులెత్తేస్తున్నారు. 

ఇప్పుడిదే విషయాన్ని బీజేపీ నేతలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. నీరందని రైతులను పోగుచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరుగనున్న దృష్ట్యా రైతుల అంశం కూడా టీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈయేడు వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలన్న భావనతో ఉన్న వ్యవసాయశాఖకు వరి స్థానంలో ఏ పంట సాగుచేయించాలన్న అంశం ఇంకా కొలిక్కి రాలేదు. వానాకాలం వరి పంట చేతికొసున్నా.. ఇంత వరకూ పంటల యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటించకపోవడంతో వ్యవసాయ శాఖ పరపతి మంట గలిసింది. అక్టోబర్‌ మొదటి వారంలోపే యాసంగి ప్రణాళిక ప్రకటించాల్సి ఉన్నా సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో పంటల సాగు వివరాలు తెలపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ సమస్య నుంచి రైతులను ఎలా బయటపడేస్తారోనన్న ఆందోళన రైతులోకంలో వినిపిస్తోంది.